బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ
వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు
అభిప్రాయం విన్నవించేందుకు బారులు తీరిన భక్తులు
బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ మఠాధిపతి నియామకంపై ఉత్కంఠ వీడడం లేదు. పలువురు పోటీ పడుతూ కోర్టును ఆశ్రయించడంతో ధార్మిక పరిషత్ చివరికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చింది. మఠంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్య వివాదం తలెత్తడంతో కోర్టును ఆశ్రయించారు. ఆరు వారాల లోపు మఠాధిపతి నియామకం జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రత్యేక అధికారిగా ఆర్‌జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించింది. దీంతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పూర్వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దభార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, వీలునామా ప్రకారం తనకే దక్కాలని రెండో కుమారుడు భద్రయ్యస్వామి మరోవైపు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ పెద్దకుమారుడు గోవిందస్వామి ఇంకోవైపు తమకే మఠాధిపతి కావాలని పట్టుపడ్డారు. పోటీ పెరగడంతో ప్రజా ప్రతినిధులు గతంలో సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణచేవారు. తుఫాన్‌ను లెక్కచేయకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు, వివిధ మఠాల నిర్వకులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందిమల్లాయపల్లె పుర ప్రజలు 1600మంది వినతిపత్రాల ద్వారా తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డీసీ పట్టెం గురుప్రసాద్ , వైఎస్సార్ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ , ఈఓలు శంకర్‌బాలాజీ, జగన్‌మోహన్‌రెడ్డి ఎండోమెంట్ అధికారులు, మైదుకూరు డీఎస్పీరాజేంద్ర ప్రసాద్, సీఐ శివశంకర్, రమణారెడ్డి, ఎస్‌ఐ శివప్రసాద్ పాల్గొన్నారు.
బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ


