క్యాష్ కొట్టు.. సబ్సిడీ పట్టు
● పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో భారీగా అవకతవకలు !
● ఒక ప్రామాణికం అనేది లేకుండా
ఇష్టారాజ్యంగా జమ
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న
పారిశ్రామిక వేత్తలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఆషాఢం సేల్...దీపావళి ధమాకా...దసరా బంపర్ ఆఫర్ అంటూ వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి వినియోగదారులకు బహుమతులు (గిఫ్ట్)లను ఎరగా వేస్తుంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ ప్రకటిస్తుంటారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మంజూరు చేయడంలో పరిశ్రమల శాఖలో ఇదే తరహా సేల్ రివర్స్‌లో జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే క్యాష్ కొడతారో వారికే రాయితీలు బహుమతులుగా వచ్చాయన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సమ్మిట్‌లో పారిశ్రామిక వేత్తలకు తాము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకుల నుంచి రూ.2వేల కోట్లు రుణంగా పొంది, అందులో రూ.1500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు దీపావళి రోజు ప్రకటించారు. ఆ ప్రకటనతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు సంబరపడి పోయారు. వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు...ప్రోత్సాహకాల విడుదలలో ప్రభుత్వం చేసిన అసలు మోసం బట్టబయలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిలువునా మోసపోయామని, ఈ దెబ్బతో చాలా చిన్న యూనిట్లు ఖాయిలా పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఒక ప్రామాణికం, విధానం అంటూ లేకుండా...
పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో పరిశ్రమల శాఖ అధికారులు ఒక ప్రామాణికం, పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ కమ్...ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అయితే సీనియారిటీ మేరకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి మొదట రాయితీలు ఇవ్వాలి. అలాకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నవారికే ఇచ్చారని అనుకుంటే అంతకుముందు దరఖాస్తు చేసుకున్నవారిని పక్కనబెట్టాలి. కానీ అటూ ఇటూ కాకుండా 2023లో రాయితీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కొందరికి, 2024లో దరఖాస్తు చేసుకున్న వారికి మరికొందరికి, 2022లో చేసుకున్న కొందరికి మంజూరు చేయడంతో పారిశ్రామిక వేత్తలు అయోమయంలో పడిపోయారు. ఎవరైతే కాసులిచ్చి విజయవాడలోని పరిశ్రమల శాఖ అధికారులను ప్రసన్నం చేసు కున్నారో వారికి మాత్రమే ప్రోత్సాహకాలు విడుదల చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం పాలసీలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాతాల్లో కూడా భారీ తేడా
ఎవరికి ఎంత శాతం రాయితీలు పడ్డాయన్నది కూడా మిస్టరీగా మారింది. ఒక యూనిట్‌కు రావాల్సిన మొత్తం రాయితీలో 20 శాతం, 40 శాతం మేర ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు సమాచారం. బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకున్నవారికి 20 శాతం, మ్యాన్యుపాక్చరింగ్ సెక్టార్ వారికి 40 శాతం రాయితీలు ఇచ్చారని తెలిసింది. కానీ కొంతమందికి 10 శాతమే రాయితీలు పడ్డాయని చెబుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం ఏ సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతెంత రాయితీలు ఇచ్చారో ప్రకటించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


