మోంథాపై ఆందోళన వద్దు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్
కడప సెవెన్‌రోడ్స్ : మోంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉందని ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, సంసిద్ధతపై జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తగు సూచనలు చేశారు. రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, చెరువులు.. ఉప్పొంగే అవకాశాలు ఉన్నందున.. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సంబంధిత సిబ్బందితో 24 గంటలు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిలో పోలీసు, అగ్నిమాపక సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యు లు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపడుతున్న ముందస్తు సంసిద్ధత ఏర్పాట్లపై ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్ : తుపాన్ కారణంగా జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో అత్యధికంగా 11.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చక్రాయపేట, ఎర్రగుంట్లలలో 10, వీఎన్‌పల్లిలో 7.2, వేంపల్లిలో 6.2, సిద్దవటంలో 3.4, మైదుకూరులో 1.8, కడపలో 1, దువ్వూరులో 0.3 మి.మీ వర్షం కురిసింది.


