వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు! | - | Sakshi
Sakshi News home page

వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!

Oct 28 2025 7:52 AM | Updated on Oct 28 2025 7:52 AM

వాన జ

వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!

కడప అగ్రికల్చర్‌ : మొంథా తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.సతీష్‌ ఉద్యాన రైతులకు సూచించారు.

కూరగాయల పంటలు..

● వర్షం ధాటికి పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదోయాలి.

● మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలతో ఉన్నట్లయితే 0.3 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె) లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2–3 సార్లు మొక్క తడిచేటట్లుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

● కూరగాయ పంటలు కొత్తగా విత్తిన లేదా నాటినట్లయితే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి.

● పంటకు ఆకుపచ్చ, కాయకుళ్లు, బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2.5 గ్రాముల సాఫ్‌ మందును కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి.

● వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 30 గ్రాములు లేదా కర్బండిజమ్‌ 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి.

పసుపు పంట..

● వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి.

● పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే, 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు అన్నభేది ఒక నిమ్మచెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

● నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్‌తో పాటు 200 కిలోల వేపపిండి వేయాలి.

● ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రాప్తికోన జోల్‌ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

● దుంపకుళ్లు ఆశించినట్లయితే పాదుల్లో మొక్కలు చుట్టూ నేలను కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాములు రిడోమిల్‌ మందును కలిపిన ద్రావణంతో తడపాలి.

పూల తోటలు..

● మొక్కలపై 2 శాతం యూరియా లేదా 1 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె)ను 2–3 సార్లు పిచికారీ చేయాలి.

● ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1–2 సార్లు పిచికారీ చేయాలి.

● కోతకు సిద్ధంగా ఉన్న పువ్వులను వీలైనంత త్వరగా కోసుకోవాలి.

● పువ్వులను కోసిన తరువాత, మార్కెట్‌కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి.

● వీలైనంత త్వరగా పువ్వులను మార్కెట్టుకు పంపాలి.

ఉల్లి పంట..

● మురుగు నీటిని బయటకు పంపాలి.

● ఆకుమచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్‌ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఉల్లి కోత దశలో..

● తుపాను హెచ్చరిక ఆధారంగా తుపాను రాక ముందే వీలైనంత తొందరగా గడ్డలను కోసుకోవాలి.

● వర్షం ఆగిన వెంటనే గడ్డలను కోయరాదు / పీకరాదు.

కోత అనంతరం..

● గడ్డలను పీకిన తరువాత 1 గ్రాము థయోఫాసేట్‌ మిథైల్‌ లేదా 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా 1 మి.లీ. ప్రొఫికోనజోల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నిల్వలో గడ్డ కుళ్లును నివారించవచ్చు.

● కోసిన గడ్డలను వర్షంలో తడవకుండా టార్పాలిన్‌ పట్టలు కప్పాలి.

● సోలారు డ్రైయర్స్‌ను ఉపయోగించి గడ్డలను తొందరగా ఆరబెట్టుకోవాలి. లేదా గడ్డలను 7 నుంచి 10 రోజులు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

● వీలైనంత తొందరగా గడ్డలను గ్రేడింగ్‌ ప్యాకింగ్‌ చేసి నిల్వ ఉంచకుండా మార్కెటింగ్‌ చేసుకోవాలి.

రైతులు జాగ్రత్తలు పాటించాలంటున్న ఉద్యానశాఖ అధికారులు

సస్యరక్షణ చర్యలు తప్పనిసరి..

వర్షాల నేపథ్యంలో రైతులు తప్పని సరిగా ఉద్యాన పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టినప్పుడే ఉద్యాన పంటలను రక్షించుకోగలరు. ఆయా పంటలు సాగుచేసిన రైతులు తప్పని సరిగా ఆయా చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలి.

– జి. సతీష్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!1
1/1

వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement