గంజాయి ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా గుట్టురట్టు

Oct 28 2025 7:52 AM | Updated on Oct 28 2025 7:52 AM

గంజాయ

గంజాయి ముఠా గుట్టురట్టు

రూ. 10.2 లక్షల విలువైన

34 కేజీల గంజాయి స్వాధీనం

14 మంది నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన

జిల్లా ఎస్పీ దీరజ్‌ కునుబిల్లి

రాయచోటి : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్‌ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్‌ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్‌ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

సొత్తు కేసు వివరాలు..

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్‌ సైకిళ్లు, 12 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్‌బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు.

కఠిన చర్యలు తప్పవు..

జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్‌ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్‌ఐ బి.రామాంజనేయులు, పీఎస్‌ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మదనపల్లె రూరల్‌ :

మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్‌ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్‌ ఆనంద్‌ కుమార్‌(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్‌ ఖాసీంసాబ్‌ కుమారుడు జాఫర్‌ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్‌ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్‌ కుమార్‌ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్‌, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్‌ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్‌ అలీ, గంగిశెట్టి శివకుమార్‌ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్‌ సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు.

గంజాయి ముఠా గుట్టురట్టు1
1/1

గంజాయి ముఠా గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement