కొప్పర్తి చెరువు కట్ట కాలువకు గండి
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి చెరువు నుంచి తాడిగొట్ల చెరువుకు నీరు వెళ్లే కట్ట కాలువకు సోమవారం గండ్లు పడడంతో నీరు వృథాగా పోయింది. సాయంత్రానికి స్పందించిన రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు జేసీబీ సహాయంతో కాలువకు పడిన గండ్లను మట్టితో పూడ్చివేశారు.
కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి
కడప ఎడ్యుకేషన్: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణమూర్తి అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అతనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలం
కబ్జాకు యత్నం
కమలాపురం : కమలాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. కడప–ముద్దనూరు ఫోర్‌లేన్ రోడ్డు మంజూరు కావడంతో కబ్జాకోరులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ఈ స్థలం నాదని, పిల్లర్ల కోసం 9 గుంతలు సైతం కొట్టించాడు. దీనిని చూసి సబ్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమవారం విద్యుత్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది సబ్ స్టేషన్ స్థలమని తమ స్థలంలో గుంతలు కొట్టించాడని ఆ గుంతలను అధికారులు పూడ్పించారు.
కార్మికుల సమస్యలపై పోరాటం
ఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు.
కొప్పర్తి చెరువు కట్ట కాలువకు గండి


