గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అట్లూరు : ప్రమాదవశాత్తు ఆదివారం సగిలేరు నదిలో గల్లంతైన ప్రభాకర్ మృతదేహం లభ్యమైంది. మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) ఓ మహిళ అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు సగిలేరు నదిలో గల్లంతైన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ, ఎస్‌ఐ రామకృష్ణయ్య, సీఐ కృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి చీకటి పడే వరకు గాలించినా మృతదేహం లభించలేదు. తిరిగి సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, అగ్నిపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఎట్టకేలకు ప్రభాకర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ముడమాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబాన్ని ఓదార్చి మేమున్నామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.


