
పెద్దదర్గా ఉరుసు విజయవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: మత సామరస్యానికి ప్రతీక అయిన కడప పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషిచేసేందుకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం దర్గా ముషాయిరా హాలులో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మత సామరస్యానికి ప్రత్యేక కూడలిగా ఉన్న దర్గా ఉరుసు కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్వహించాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయన్నారు. ఉరుసు జరిగే అన్ని రోజుల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు నిరంతర పారిశుద్ద్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు విధులు పక్కాగా ప్రణాళికయుతంగా నిర్వర్తించాలన్నారు. నవంబరు 5, 6, 9 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు గనుక ఆరోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ, పోలీసు, ఉరుసు ఉత్సవ కమిటీ సమన్వయంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భక్తుల రాక అధిక సంఖ్యలో ఉంటుంది గనుక ప్రజా రవాణా సర్వీసులసంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టులలో సమాచార సలహా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో దర్గా ఉత్సవ కమిటీకి సంబంధించిన వలంటీర్లు ఉంటూ ఉరుసుకు వచ్చే భక్తులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పురుషులు, మహిళలకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సురక్షితమైన తాగునీరు, హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఎమ్మెల్యే మాధవీరెడ్డి, నగర మేయర్ ముంతాజ్‌బేగం, ఇతర అధికారులు, వివిధ వర్గాల ప్రతినిధులు, దర్గా భక్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
పీఠాధిపతితో కలిసి ఉత్సవాలపోస్టర్ ఆవిష్కరణ
నవంబర్ 4 నుంచి ఉరుసుఉత్సవాల నిర్వహణ