
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతో కలిసి కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేయనున్నామన్నారు. అక్టోబర్ 23న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు తరలింపు చేసి, నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారన్నారు. ఆ తర్వాత గవర్నర్‌కు కోటి సంతకాల సేకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పులి సునీల్, పి. ప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, రఘునాథరెడ్డి, షఫీవుల్లా, సీహెచ్ వినోద్, చీర్ల సురేష్ యాదవ్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ శ్రీకారం
పోస్టర్లు ఆవిష్కరించినవైఎస్సార్‌సీపీ నేతలు