
కొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టి.!
● గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న
కన్‌స్ట్రక్షన్ కంపెనీ
● చోద్యం చూస్తున అధికారులు
రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన గ్రావెల్
లారీల ద్వారా తరలిస్తున్న గ్రావెల్
జమ్మలమడుగు : ప్రకృతి వరప్రసాదమైన కొండలను రోడ్ల నిర్మాణం పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇటాచీలతో కొండలను కొల్లగొట్టి అందులో ఉన్న గ్రావెల్స్‌ను భారీ లారీలతో తరలిస్తున్నారు. అధికారులు సైతం ఏమీ తెలియనట్లు, పైగా అది తమకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
167వ జాతీయ రహదారి పనుల కోసం ..
నంద్యాల నుంచి జమ్మలమడుగు మండల పరిధిలోని మూడు రోడ్ల క్రాస్ వరకు 167వ జాతీయ రహదారుల పనులు చేపడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 22 కిలో మీటర్ల పనులు ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తోంది. అయితే ఎస్‌ఆర్‌సీ కంపెనీ మాత్రం తమకు పదివేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కావాలని దానికి సంబంధించిన అనుమతులు కోరుతూ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారులు గ్రావెల్ తవ్వుకునేందుకు ఎక్కడ అనుమతులు ఇచ్చారో తెలియదు గాని తమకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో ఇటాచీలతో కంపెనీ మొత్తం కొండను తవ్వేస్తున్నారు.
30 నుంచి 50 ఎకరాల్లో...
మండల పరిధిలోని కొత్తగుంటపల్లె సమీపంలో 30 నుంచి 50 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎస్‌ఆర్‌సీ కంపెనీ యాజమాన్యం తవ్వకాలు చేపట్టింది. భారీ వాహనాల ద్వారా ఈ ప్రాంతంలో గ్రావెల్‌ను బయటికి తీసి లారీల ద్వారా రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జమ్మలమడుగు పట్టణంలో నుంచి భారీ లారీల ద్వారా గ్రావెల్‌ను తీసుకెళుతున్నా ఎందుకు, ఎక్కడికి తీసుకెళుతున్నారని ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు సైతం ప్రశ్నించడం లేదు. దీంతో భారీగా గ్రావెల్ తవ్వుకుని రోడ్డు నిర్మాణానికి ఉపయోగించుకుంటున్నారు.
తమకు సంబంధం లేదంటున్న ఆర్డీఓ...
మండల పరిధిలోని కొత్తగుంటపల్లె ప్రాంత సమీపంలో నుంచి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో గ్రావెల్ అక్రమంగా తీసుకెళుతున్నారని ఆర్డీఓ సాయిశ్రీని ప్రశ్నించగా గ్రావెల్ తీసుకెళ్లేందుకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వాలి కానీ, అది తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.
మేము అనుమతి ఇవ్వలేదు..
జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్‌ఆర్‌సీ కంపెనీకి సంబంధించిన ఫైల్ పెండింగ్‌లో ఉంది. వారికి మైనింగ్‌కు సంబంధించిన అనుమతులు తాము ఇవ్వలేదని జిల్లా మైనింగ్ అధికారి వెంకటసాయి పేర్కొన్నారు.

కొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టి.!