
బైక్ అదుపుతప్పి డీఎల్‌డీఓ సూపరింటెండెంట్ మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయం(డీఎల్‌డీఓ)లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న తిప్పాబత్తిని గురుస్వామి (57) బుధవారం సాయంత్రం బైకు అదుపు తప్పి కిందపడిన ఘటనలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి బైక్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో సలివెందుల గ్రామం సుంకాలమ్మ దేవాలయం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనదారులు గమనించి కిందపడిన గురుస్వామిని లేపి కూర్చోబెట్టారు. గురుస్వామి తన ఫోన్ ఇచ్చి సమాచారాన్ని తన కుమారుడు మురళికి తెలపాలని సూచించడంతో వారు ఫోన్ చేశారు. అనంతరం 108 సహాయంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడు మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి
కేవీపల్లె : వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మండలంలోని నూతనకాల్వ పంచాయతీ కామిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కామిరెడ్డిగారిపల్లెకు చెందిన అబ్బవరం సత్యంరెడ్డికి చెందిన భూమిలో ఉన్న రాతి కూసాలను బుధవారం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి, ఆనందరెడ్డి, దేవేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి విరగ్గొట్టారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీకి చెందిన సత్యంరెడ్డి తోపాటు కంభం కొండారెడ్డి (61), కామిరెడ్డి వెంకటరమణారెడ్డి (42)లపై కొడవలి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ముగ్గురిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు సత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు.
గణేష్ ఊరేగింపులో యువకుడి హల్‌చల్
పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పీలేరులో జరిగిన గణేష్ ఊరేగింపులో రివాల్వర్‌తో ఓ యువకుడు హల్‌చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పీలేరు పట్టణంలో గణేష్ విగ్రహాల సామూహిక ఊరేగింపు, నిమజ్జనం జరిగింది. ఊరేగింపు సందర్భంగా చెన్నారెడ్డికి చెందిన గణేష్ విగ్రహం వద్ద ఓ యువకుడు రివాల్వర్‌తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ విచారణ జరిపి యువకుడు అధికార పార్టీకి చెందిన గుండ్లూరు వెంకటరత్నంగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రివాల్వర్ ఆకారంలో ఉన్న లైటర్‌గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. లైటర్‌ను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శివకుమార్ ఎదుట బైండోవర్ చేసి విడుదల చేశారు.

బైక్ అదుపుతప్పి డీఎల్‌డీఓ సూపరింటెండెంట్ మృతి