
వైవీయూ భవనాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం అకడమిక్ బిల్డింగ్, ఆడిటోరియం, వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్ నిర్మాణాల శంకుస్థాపన శిలాఫలకాన్ని మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) కింద రూ.10.5 కోట్లతో యోగివేమన విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల ప్రారంభ కార్యక్రమం జరిగింది.
స్మార్ట్ కిచెన్ సెంటర్ ప్రారంభం
చింతకొమ్మదిన్నె : రాష్ట్ర విద్య, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ చింతకొమ్మదిన్నెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ సెంటర్‌ను, ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. సాయంత్రం కొలుములపల్లి సమీపంలో కమలాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రారంభం
పెండ్లిమర్రి : మండల కేంద్రం సమీపంలో నూతనంగా రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆ అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను, పరిపాలనా భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాపరంగా నాణ్యత పెంచడానికి సూచనలు అడిగారు.
ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం ప్రారంభం
కడప కార్పొరేషన్ : కొప్పర్తి పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని రాష్ట్ర విద్య, ఐటి, సాంకేతిక, ఆర్టీజీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో రూ.31.50 కోట్లతో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం టెక్నోడోమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్‌ను సందర్శించి అక్కడ లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్ యూనిట్, డార్క్ రూమ్, ఈఎస్డీ ప్రొటెక్టెడ్ యూనిట్‌లను పరిశీలించారు. ఆ తర్వాత టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్ పాల్గొన్నారు.