
మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో మహిళల రక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పైగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది బెల్టుషాపులు ఏర్పాటు చేశారని.. మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతిరోజూ మహిళలపై 70 అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ప్రతి గంటకు 4 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. పోలీసులను ప్రజల రక్షణకు ఉపయోగించకుండా.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుకు, ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు వాడుతున్నారని ధ్వజమెత్తారు.
పీఆర్సీ, డీఏల సంగతేంటి?
ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు వారిని పట్టించుకోవట్లేదని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి విమర్శించారు. పీఆర్సీ వేయలేదని, ఐఆర్ ఇవ్వలేదని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు విడుదల చేయలేదని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ హామీని సైతం నెరవేర్చలేదని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు విజయ మనోహరి, ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు.