
మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం : గండికోట జలాశయం గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి ఐదువేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు జీఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా 13 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపారు. శెట్టివారిపల్లె మొయిన్ రెగ్యులేటర్ నుంచి గాలేరి నగరి సృజల స్రవంతి కాల్వ ద్వారా వామికొండ రిజర్వాయర్‌కు 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా నాలుగు మోటర్లతో నీటిని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.