
గండి ఆంజన్న దర్శనానికి ఏర్పాట్లు
చక్రాయపేట : శ్రావణమాసంలో మూడో శనివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహా య కమిషనర్ వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలికృష్ణతేజ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేశామని తెలిపారు. రాత్రి బసచేసే వారి కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాతలు అన్నదానం చేస్తారన్నారు. వీఐపీ పాసులు పొందినవారు నిర్ణయించిన సమయంలో వస్తేనే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాలన్నారు. గత శనివారం జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, ఐదు గంటలకు మహామంగళ హారతి నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు.
స్వామి సన్నిధిలో తిరుపతి జిల్లా జడ్జి
గండి వీరాంజనేయ స్వామిని శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనచే ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగనాయకులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ మూడో శనివారం కావడంతో పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. వాహనాలను గండిలోకి అనుమతించమని వారు తెలిపారు.

గండి ఆంజన్న దర్శనానికి ఏర్పాట్లు