
ఏకశిలానగరిలో వేడెక్కిన ప్రచారం
సాక్షి, రాయచోటి : కూటమి సర్కార్ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అడ్డదారుల వైపు అడుగులు వేస్తోంది. సాధారణ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా మంత్రులు మకాం వేసి అధికార దుర్వినియోగం చేయడం ఇందుకు అ ద్దం పడుతోంది. ఎలాగైనా సరే గెలవాలనే సంకల్పంతో అవసరమైన అన్ని వనరులను ఉపయోగిస్తున్నా రు. అధికారంలో ఉండడంతో తాము ఓటమి పాలైతే సర్కార్ ప్రతిష్ట మంటగలుస్తుందనే ఆలోచనతో ఇతర పార్టీలవారిని భయపెట్టడమో.. ఆదుకుంటామని చెబుతూ పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఒంటిమిట్ట, పులివెందుల లాంటి కేంద్రాల్లో తిరుగులేని ఆధిక్యత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికే ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
గెపుపే లక్ష్యంగా..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్లో పట్టున్న వారితో చర్చించడంతోపాటు ఓట్లు భారీగా పడేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరోపక్క ప్రచారంలో ప్రజలతో కలిసిపోయి... వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ఓటు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి వేయాలంటూనే ఎన్నికల ముందు హామీలిచ్చి తరువాత విస్మరించిన కూటమి సర్కార్ మోసాలను కూడా వివరిస్తున్నారు. టీడీపీ వేస్తున్న ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులతో పాటు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
జోరుగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ప్రచారం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా చింతరాజుపల్లెలో కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ప్రచారం నిర్వహించారు. అలాగే మృకుంద ఆశ్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, యువజన విభాగం నాయకులు దేవిరెడ్డి ఆదిత్యలు ప్రచారం చేశారు. కోదండరామనగర్, మంటపంపల్లి తదితర ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గంగపేరూరు పంచాయతీలోని చిన్నకొత్తపల్లెలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి తదితరులు ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో సుబ్బారెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే ప్రజల నుంచి కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ సంపూర్ణమద్దతు లభిస్తోంది.
ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఫరూక్ లతో పాటు పలువురు నాయకులు ప్రచారం నిర్వహించారు.
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు
పలు గ్రామాల్లో వైఎస్‌ఆర్‌సీపీ
నేతల ప్రచారం
ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో పోలింగ్‌పై దృష్టి సారించిన పోలీసులు
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఒంటిమిట్టతో పాటు మంటపంపల్లి, ఇతర అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్‌కుమార్, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎక్కడికక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలను కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
పులివెందుల : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసుల ఆరాచకాలు ఎక్కువయ్యాయని, ఒకే వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల మండలం కొత్తపల్లెలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో మేం లేకపోతే ప్రాణాలు తీసి ఉండేవారని స్వయానా డీఐజీ చెప్పడం చూస్తే.. దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతోందన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ అధికారులే మాట్లాడటం నీచమైన సంస్కృతి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా పోలీసు ఆరాచకాలే ఎక్కువయ్యాయని, ఒక వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్దతి కాదన్నారు. ఏదీ ఏమైనా రెండు, మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డీఐజీ ఈ మెసేజ్ ఇవ్వడమనేది బాధాకరమైన విషయమన్నారు. కిందిస్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారి మెసేజ్‌ను బట్టి అలా చేయడం దారుణమన్నారు. గతంలో ఒక గ్రామంలో మూడు, నాలుగు ఇళ్లను ఓటు అడిగి వచ్చేవారని, క్రమేనా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని అడగాలనే సంస్కృతి వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు వైఎస్సార్ ఆశయాలు, వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఓటు వేస్తారన్నారు.

ఏకశిలానగరిలో వేడెక్కిన ప్రచారం