
పొలంలో అక్రమ పైపులైన్ వేస్తే ఆత్మహత్య చేసుకుంటాం
చాపాడు : రెవెన్యూ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పొలంలో అక్రమంగా పైపులైను ఏర్పాటు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని మండలంలోని అల్లాడుపల్లెకు చెందిన రైతు దంపతులు గోసుల ఎరికలయ్య గారి కుళ్లాయిరెడ్డి, పద్మావతి బుధవారం వాపోయారు. మండలంలోని అల్లాడుపల్లె పొలం సర్వే నెంబరు 90–2లోని కుళ్లాయిరెడ్డి పొలంలో బుధవారం తన తమ్ముడైన సుధాకర్‌రెడ్డి జేసీబీ పెట్టి పైపులైన్ ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా కుళ్లాయిరెడ్డి, తన భార్య పద్మావతి, కూతురు రాజేశ్వరి పనులు అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. దీంతో పనులు ఆపి వెళ్లిపోయారు. బాధితులు మాట్లాడుతూ.. సర్వే నెంబరు 90–2లో 2.50 ఎకరాల సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అల్లాడుపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు, వీఆర్వో, ముగ్గురు పోలీసులు సహాకారంతో సుధాకర్‌రెడ్డి బుధవారం తమ పొలంలోకి జేసీబీని తీసుకువచ్చి పైపులైను ఏర్పాటు కోసం పనులు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా చేయగా అడ్డుకున్నామని మళ్లీ ఇప్పుడు అధికారులను అడ్డుపెట్టుకుని తహసీల్దారు రమాకుమారి తమకు ఆదేశాలు ఇచ్చిందని చెబుతూ తమ పొలంలో అక్రమంగా పైపులైను వేసేందుకు ప్రయత్నించాడన్నారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు.
తహసీల్దార్ ఏమన్నారంటే..
అల్లాడుపల్లెలోని రైతు కుళ్లాయిరెడ్డి పొలంలో పైపులైన్ నిర్మాణం విషయమై తహసీల్దార్ రమాకుమారిని వివరణ కోరగా.. కుళ్లాయిరెడ్డి పొలంలో పైపులైను వేసుకోవచ్చని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. తన వద్దకు ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు.
అల్లాడుపల్లెలో జేసీబీతో చేస్తున్న
పనులు అడ్డుకున్న రైతు దంపతులు