
పాలక వర్గాలపై పోరాటం
బద్వేలు అర్బన్ : అపసవ్య విధానాలు అవలంబిస్తున్న పాలక వర్గాలపై పోరాటాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సీపీఐ 25వ జిల్లా మహాసభల సందర్భంగా రెండవ రోజైన బుధవారం స్థానిక నెల్లూరు రోడ్డులోని రాఘవేంద్ర గ్రాండ్‌లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఓట్లు, సీట్లు కొలమానం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల జీవన స్థితిగతులు మారుస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం పేద ప్రజల, రైతుల, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపై ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు అనే ముద్ర వేసి ఆపరేషన్ కగార్ పేరుతో కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద, అటవీ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, నాగసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రామయ్య, వెంకటశి వ, బాదుల్లా, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, ఏరియా సహా య కార్యదర్శి మస్తాన్, పట్టణ, రూరల్ కార్యదర్శులు బాబు, ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.