
ప్లాస్టిక్ హానిపై ప్రజలకు విస్తృత అవగాహన
కడప సెవెన్‌రోడ్స్ : ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే హానిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధికారులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి ఆయన అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రధానంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అవగాహనతోపాటు విస్తృత ప్రచా రం నిర్వహించాలన్నారు. మార్కెట్లు, హోల్‌సేల్‌లను తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించాలన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలన్నారు. దేవాలయాల్లో ప్రసాదం, అన్నదానం పంపిణీకి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుధ, పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.