
గండి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ అధికారులు, పాలకవర్గం ఇప్పటికే పోలీసు, పారిశుధ్యం, వైద్యం, విద్యుత్, ఇంజినీరింగ్, రవాణా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆ మేరకు ఏర్పాట్లను చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పాపాఘ్ని నదిలో మహిళలు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక వసతిని కల్పిస్తున్నట్లు ఆలయ అధికారి వివరించారు. గండి ఉత్సవాల సందర్భంగా పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు చక్రాయపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తరపున ఉచితంగా ఇస్తున్నట్లు మేనేజర్ భానుచందర్ తెలిపారు. పాసులు కలిగిన వారు, వీఐపీలకు ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు.