
అక్రమాలను అడ్డుకునేవారేరీ!
అక్రమ కేసులతో భయోత్పాతం
అనుమతులు లేకుండానే హద్దులు ఏర్పాటు
ప్రభుత్వ, ప్రైవేటు భూములు దర్జాగా స్వాహా
ఇదీ షెల్ సోలార్ ప్లాంట్ ప్రతినిధుల తీరు
కంపెనీకి అండగా కూటమి నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి నేతల అండ చూసుకుని షెల్ సోలార్ కంపెనీ ప్రతినిధులు పేద రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. వారి సొంత భూములపై కూడా హక్కుల్లేకుండా చేస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నారు. ఇంకా ముందుకెళ్లి అక్రమ కేసులూ పెడుతున్నారు. నోరున్నోళ్లకు మాత్రమే కాస్తా వెనక్కి తగ్గుతున్నారు.
● కడప–నంద్యాల జిల్లాల సరిహద్దుల గ్రామాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం షెల్ కంపెనీ ముందుకు వచ్చింది. పెద్దముడియం మండలం కల్వాటాల గ్రామం పంట పొలాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత చూపలేదు. దాంతో 30ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎకరానికి రూ.32వేలు లీజు చెల్లిస్తామని ముందుకు వచ్చారు. అయినప్పటికీ రైతులు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించలేదు. వెంటనే దళారులను ప్రవేశ పెట్టి రైతుల మధ్య ఉన్న అనైక్యతను సొమ్ము చేసుకునేందుకు సన్నాహాలు చేశారు. వారి వ్యూహం ఫలించి, కొంతమంది రైతులు సోలార్ కంపెనీకి అనువుగా లీజుకు భూములిచ్చారు. మరికొందరు తమకున్న ఆదరువు భూమి ఒక్కటేనని.. ఉన్న భూమికి మీకు అప్పగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో షెల్ కంపెనీ ప్రతినిధులు లేరు, వారికి అండగా నిలుస్తోన్న కూటమి సర్కార్ నేతలకు అస్సలు లేదు. బెదిరింపులకు దిగుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇష్టం లేకపోయినా కొందరు రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకున్నారు.
అడ్డం తిరిగిన రైతులకు అందలం...
నోరున్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడికే అండగా నిలుస్తారని కల్వాటాల గ్రామంలో మరోమారు రుజువయ్యింది. తమ భూమిలోకి దిగొద్దు, తాము లీజుకు ఇవ్వం అన్నోళ్లకు.. మీరెవరికీ చెప్పొద్దంటూ ఎకరం రూ.14లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఇలా అందరికి అదే స్థాయిలో చెల్లించి భూములు కొనుగోలు చేశారా? అంటే అదీ లేదు. కొందరికి ఎకరం రూ.8లక్షలకు కూడా కొనుగోలు చేసి, స్వాఽధీనం చేసుకున్న భూములు కూడా ఉన్నాయి.
ఈ మహిళా రైతు పేరు పామిడి వరలక్ష్మి. ఈమెది పెద్దముడియం మండలం కల్వటాల గ్రామం. ఆ గ్రామంలో సర్వే నంబర్ 306లో 2.69 ఎకరాలు భూమి ఉంది. ‘షెల్’సోలార్ కంపెనీ వారు ఆమె అనుమతులు లేకుండా పొలంలో 6 అడుగుల లోతు రంధ్రాలు వేశారు. అందులో సిమెంటు దిమ్మెలతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే భూమిని కంపెనీకి లీజు రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తమకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. లీజుకిస్తే వారి వివాహాలకు ఇబ్బందవుతుంది.. ఇతర రైతుల భూములు కొనుగోలు చేసినట్లుగా తమ భూమి కొనుగోలు చేయాలని కోరింది. అలా కుదరదు మీ భర్త సంతకాలు తీసుకున్నాం. మీరు సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు.
అదే గ్రామానికి చెందిన అక్కంరెడ్డి సుజాత పేరిట ఉన్న భూమిలో ఎలాంటి సమాచారం లేకుండా కనీస అనుమతి లేకుండా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త మధుసూదన్‌రెడ్డితో కలిసి పొలం వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా తమ భూమిలో ఎలా పనులు చేస్తారంటూ నిలదీశారు. అంతే సదరు కంపెనీ ప్రతినిధులు పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి మధుసూదనరెడ్డిపై నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేయించి, రిమాండ్‌కు పంపించారు. 33రోజులు భర్త రిమాండ్‌లో ఉండడంతో సుజాత జిల్లా యంత్రాంగాన్ని కలిసి మొరపెట్టుకుంది. ఎవరు కనికరించలేదు. కలెక్టర్ సైతం పట్టించుకోలేదు. ఈ రెండు కుటుంబాలే కాదు... కల్వటాల గ్రామంలో చాలా మంది రైతుల దుస్థితి ఇది.
● అక్రమాలను అడ్డుకునేవారేరీ!
రైతులకు తెలియకుండానే వారి భూముల్లో స్తంభాలు వెలిశాయి. పెంచుకున్న చీని చెట్లు నెలకొరిగాయి. ఇదేమి అన్యాయమంటూ కొంతమంది రైతులు పెద్దముడియం పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఉచిత సలహాలు తెరపైకి వచ్చాయి. ఒక్కరో ఇద్దరో రైతులు అడ్డం తిరిగితే వారిపై అధికార పార్టీ నాయకుల్ని ప్రయోగిస్తున్నారు. అప్పటికీ విన్పించుకోకపోతే అలాంటి వారిపై అక్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. పాపం రైతులు...ఎవరూ పట్టించుకోకపోవడంతో దిగాలు పడుతున్నారు.