జీతాలు ఎప్పుడిస్తారు! | - | Sakshi
Sakshi News home page

జీతాలు ఎప్పుడిస్తారు!

Jul 23 2025 2:28 PM | Updated on Jul 23 2025 2:28 PM

జీతాలు ఎప్పుడిస్తారు!

జీతాలు ఎప్పుడిస్తారు!

కడప ఎడ్యుకేషన్‌: బదిలీలు ఉపాధ్యాయులకు శాపంగా మారాయి. ఈ ఏడు బదిలీల ప్రక్రియ ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటున్న గురువులకు.. తాజాగా జీతాల సమస్య వారిని తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. స్థాన చలనం కలిగిన వారికి జీతాల చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోంది. బదిలీ అయి న ఉపాధ్యాయులకు విద్యాశాఖ పొజిషన్‌ ఐడీలు ఇవ్వకపోవడంతో వారికి జీతాలు పడట్లేదు. బదిలీల సాకుతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాద్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బదిలీ అయిన ప్రాంతాల్లో....

ఉద్యోగులైనా.. ఉపాధ్యాయులైనా సాధారణంగా బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా ఆ ప్రాంతంలోని డీడీఓలకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దీని కోసం ఉపాధ్యాయులకు ఐడీలు కేటాయించాలి. బదిలీ ప్రక్రియ పూర్తయి నెల రోజులు దాటినా ఇంత వరకు చాలామంది ఉపాధ్యాయులకు పొజిషన్‌ ఐడీలను కేటాయించలేదు. పాఠశాలల ప్రారంభంమైన జూన్‌ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పిల్లల స్కూల్‌ ఫీజులు, విద్యా సామగ్రి, దుస్తులు ఇలా వేలకు వేలు వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, ఇంటి అద్దెలు ఇలా పలు రకాల ఖర్చులు తడిసి మోపెడవుతున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4217 మంది...

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4217 మంది వివిధ క్యాడర్లలో ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. వీరిలో 202 మంది గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులు కాగా, 1815 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 2047 మంది సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌, 114 మంది లాంగ్వేజ్‌ పండిట్లు, 11 మంది ఏఆర్‌టీ, క్రాప్ట్‌, మ్యూజిక్‌, ఒకేషన్‌ ,28 మంది ిఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో జూన్‌ 15 నాటికి 4217 మంది వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వీరిలో కొత్తగా ఏర్పడిన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యా రు. అలాగే మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు, హైస్కూ ళ్లు కొత్తగా ఏర్పడటంతో ఇక్కడకు వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్‌ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా 1000 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. వీరందరికీ ఇప్పుడు జీతాలు పడలేదు. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరగా బదిలీ అయిన వారి వివరాలను కమిషనర్‌ కార్యాలయానికి పంపించామని.. ఈ నెలాఖరుకంతా సమస్య పరిష్కారం అవుతుందని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు.

జీతాల చెల్లింపులో జాప్యం తగదు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా గత జూన్‌ మాసంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల ద్వారా ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపులో ఆలస్యం తగదని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌,పాళెం మహేష్‌ బాబు తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప యూటీఎఫ్‌ భవన్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. జీతాలు చెల్లించుటకు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బదిలీలకు ముందే ఏ పోస్టు ఏ పాఠశాలకు షిఫ్ట్‌ అవుతుందో విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంలో జాప్యం చేశారని మండిపడ్డారు. జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్‌,డి సుజాత రాణి జిల్లా కార్యదర్శులు సివి రమణ, ఏజాస్‌ అహమ్మద్‌, ప్రసన్న లక్ష్మి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కృష్ణారెడ్డి, రూతు ఆరోగ్యమేరీ నాయకులు గాజులపల్లి గోపీనాథ్‌, రామకేశవ, వీరనారాయణ, శంకర్‌ రెడ్డి, దేవదత్తం,ఈశ్వర రావు, సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బదిలీ టీచర్లకు వేతన కష్టాలు

పొజిషన్‌ ఐడీల కేటాయింపులోప్రభుత్వ నిర్లక్ష్యం

బదిలీలు జరిగి నెలరోజులైనా ఇవ్వని ఐడీలు

జిల్లాలో వేలాదిమంది టీచర్ల కుటుంబాలపై ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement