
నీళ్లపై రాజధాని నిర్మిస్తున్నారు
కడప రూరల్: టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిలో నీళ్లపై రాజధాని నిర్మిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. మంగళవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో మూరెడు మట్టి తీస్తే.. చారెడు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దేవతల నగరం అంటున్నారని, అక్కడ మాత్రం కర్రతుమ్మ చెట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల ప్రజల్లో రాజధానిపై అసంతృప్తి ఉందన్నారు. రాయలసీమలో పరిపాలనా రాజధాని, విశాఖపట్నంలో హైకోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక, బనకచర్ల అంశాన్ని పరిశీలించాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయని, మరో 5 వేల పాఠశాలలను మూత వేయా లనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య అందని పరిస్థితి ఏర్పడటం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం లేదన్నారు. బీటెక్, ఎంబీఏ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈవీఎంలపై వస్తున్న విమర్శలు కరెక్టే అన్నారు. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కొంతమంది తన వద్దకు వచ్చి.. ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని చెబితే ఆశ్చర్యపోయానని అన్నారు. వారు చెప్పిన కొన్ని ఉదాహరణలు వింటే నిజమే అనిపించిందన్నారు. మోడరన్ టెక్నాలజీ ద్వారా, రిమోట్‌తో టీవీని కంట్రోలు చేసే విధంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని వివరించారన్నారు. అందుకు ప్రతిఫలంగా వారు రాజకీయంగా పెద్ద పెదవినే కోరడంతో వారికి ఒక దండం పెట్టి నాకీ సమస్యలు వద్దని చెప్పానని పేర్కొన్నారు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో, కీలకమైన ప్రదేశాల్లో ట్యాంపరింగ్ ద్వారా ఓడిపోయే వారిని గెలిపిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించి రూ. 14.50 లక్షల కోట్లు ఎన్‌పీఎల్ అయ్యాయని చింతా మోహన్ అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం రుణ మాఫీ చేసిందని తెలిపారు. అందుకు గాను 10 శాతం డబ్బును వసూలు చేశారని ఆరోపించారు. గుజరాత్‌కు చెందిన వారికే ఎక్కువగా రుణ మాఫీ జరిగిందన్నారు. ఇందులో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు.
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలున్నాయి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆగ్రహం