
రెండు ఇళ్లలో చోరీ
7.7 తులాల బంగారు నగలను
దోచుకెళ్లిన దొంగలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని నేతాజినగర్‌లో ఏక కాలంలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. సత్యాల దస్తగిరి, పఠాన్ గైబూసాహెబ్ ఇళ్లలో సుమారు 7.7 తులాల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యాల దస్తగిరి ఇంట్లో విద్యుత్ లేకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి పడుకున్నారు. అలాగే పఠాన్ గైబూసాహెబ్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం కర్నాటక రాష్ట్రంలోని దాదాపహాడ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు రెండు ఇళ్లకు వేసిన తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నేతాజినగర్–4లోని దస్తగిరి ఇంట్లో 5 తులాలు, నేతాజినగర్–2లోని గైబూసాహెబ్ ఇంట్లో 27 గ్రాముల బంగారు, 600 గ్రాములు వెండి నగలను దోచుకెళ్లారు. సోమవారం వేకువ జామున 2.40 గంటల సమయంలో చోరీ జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.