
వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేయడమే అమానత్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి జనాబ్ అబ్దుల్ రఖీబ్ తెలిపారు. ఆదివారం కడప నగరంలో అమానత్ మ్యూచువల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మూడో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేసి వారు ఆర్థికంగా కుదుటపడేందుకు, వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఈ బ్యాంకు కృషి చేస్తుందన్నారు. 2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఇస్లామిక్ బ్యాంక్ ఆవశ్యకతను తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి ఆనాటి మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు విషయాన్ని ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముతీకుర్రహ్మాన్, సంఘ సేవకులు సల్లావుద్దీన్, కడప ఇస్లామిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మా స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారు
– న్యాయం చేయాలని ఒంటరి మహిళ వేడుకోలు
కడప కార్పొరేషన్ : కడప నగర శివార్లలోని ఇందిరానగర్‌లో సర్వే నంబర్ 715లో 112 ప్లాట్ నంబర్‌లో తాము పదేళ్లుగా పొజిషన్‌లో ఉన్నామని, ఇప్పుడు వేరేవాళ్లు వచ్చి ఆ స్థలం తమదంటున్నారని ఒంటరి మహిళ రఖీబ్ జాన్ ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం ఉదయం కొంతమందిని పోగేసుకొని వచ్చి తమ స్థలంలో ఉన్న రేకుల షెడ్డును దౌర్జన్యంగా తొలగించారని వాపోయింది. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2010లో తమ తల్లి ఖాతూన్ బీ పేరుతో రెవెన్యూ అఽధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని, ఆ స్థలంలో తాము బేస్‌మట్టం వేసుకొని రేకుల షెడ్డు, కట్టెలు ఏర్పాటు చేసుకొని ఉన్నామన్నారు. 2018లో ఖాతూన్ బీ మరణించడంతో ఆమె కుమార్తెగా తాను ఆ స్థలాన్ని కాచిపెట్టుకొని ఉన్నానన్నారు. కాగా ఇటీవల రైల్వేకోడూరుకు చెందిన రుద్రరాజు శంకర్‌రాజు అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌నని చెబుతూ ఆ స్థలం తన భార్య రుద్రరాజు లక్ష్మిదేవి పేరున ఉందని మరొక పొజిషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చారన్నారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా వారు రిపోర్టు కోసం రెవెన్యూ వారికి రాశారన్నారు. ఆ నివేదిక ఏదీ తమకు ఇవ్వకుండానే తమ స్థలంలోకి వచ్చి దౌర్జన్యంగా రేకుల షెడ్ తొలగించడం అన్యాయమన్నారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఎన్నో ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేష్మ పాల్గొన్నారు.

వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం

వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం