
రక్తదానం సామాజిక బాధ్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్తదానం సామాజిక బాధ్యతగా భావిస్తూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్త వారోత్సవాల రెండో వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మొదటిరోజు కడప నగరం బాలాజీ నగర్‌లో జేబీవీఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్వో, డీఎంహెచ్‌ఓ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమమన్నారు. రానున్న రోజుల్లో వర్షాకాల ప్రభావం వల్ల రక్త అవసరాలు పెరగనున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాలు ఎంతో సహాయపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ , సభ్యులు ఈశ్వరయ్య, వికసిత ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీదేవి, వెంకటనారాయణ రెడ్డి, ప్రభుత్వ సిబ్బంది, డాక్టర్ ఓ.వి.రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగనాథరెడ్డి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.