పక్కీర్‌పల్లె.. ఖాళీ | - | Sakshi
Sakshi News home page

పక్కీర్‌పల్లె.. ఖాళీ

Jul 13 2025 7:38 AM | Updated on Jul 13 2025 7:38 AM

పక్కీ

పక్కీర్‌పల్లె.. ఖాళీ

పోలీసుల కేసుకు భయపడి ఊరు వదిలి వెళ్లిన గ్రామస్తులు

ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే

నిర్మానుష్యంగా మారిన గ్రామం

వేంపల్లె : వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న పక్కీర్‌పల్లె ఖాళీ అయింది. పోలీస్‌స్టేషన్‌ ముట్టడి సంఘటనలో పోలీసులు పెట్టే కేసులకు భయపడి.. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామంలో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్న మగ, ఆడ, పిల్లలు ఇలా అందరూ వెళ్లిపోయారు. కొందరు ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు వీధుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప, జనాలు ఎక్కువ మంది లేరు. వివరాలలోకి వెళితే.. పక్కీర్‌పల్లెలో ఈ నెల 7వ తేదీన గొర్రెలు మేపేందుకు సమీపంలోని కొండల్లోకి 17 ఏళ్ల అమ్మాయి వెళ్లింది. ఆమె అదృశ్యం కావడంతో బంధువులు గ్రామస్తులను పిలుచుకుని వేంపల్లె పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకబాబు అనే యువకుని సెల్‌ఫోన్‌లో అమ్మాయి బట్టలు చిరిగిపోయి, దండం పెట్టే వీడియో ఉండటంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. అమ్మాయిని రేప్‌ చేసి చంపేశారేమోనన్న అనుమానంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద రచ్చ చేశారు. దీంతో అమ్మాయి బంధువులు, గ్రామస్తులపై పోలీసులు హత్యాయత్న కేసు నమోదు చేశారు.

పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారని

కేసు నమోదు

అయితే అదే రోజు రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో అమ్మాయి.. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న తండ్రికి ఫోన్‌ చేసి తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. దీంతో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ నేతృత్వంలో పోలీస్‌ బృందాలు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మాయిని సురక్షితంగా కడప రిమ్స్‌కు తరలించారు. అమ్మాయి దొరికింది అనే విషయం చెప్పినా కూడా కొంత మంది ఆందోళనకారులు వారి ఆందోళన విరమించలేదు. అప్పటికే పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కిటికీ అద్దాలు కుర్చీలు, వాకిళ్లను పగులగొట్టారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ సెంట్రీ డ్యూటీలో ఉన్న రామాంజనేయులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారని కేసు నమోదు చేశారు. కొంత మందిని ఇప్పటికే అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కీర్‌ పల్లెకు చెందిన బాలికకు, చింతలమడుగుపల్లెకు చెందిన మడక బాబుకు చనువైన పరిచయం ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ మధ్యాహ్న సమయంలో వజ్రాలకోన దగ్గర ఉన్నట్లు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడంతో.. అమ్మాయి తల్లిదండ్రులు మరి కొంత మందితో కలిసి గుట్టలో వెతకగా మడక బాబు కనిపించాడు. అమ్మాయి బంధువులు మడక బాబుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 7వ తేదీ సాయంత్రం పోలీస్‌స్టేషన్‌ వద్దకు పిలుచుకుని వచ్చినట్లు కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

60 మందిని అదుపులోకి..

అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో కొంతమంది మూకుమ్మడిగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. మడక బాబును విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా.. వినకుండా పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ దాడి చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. దీంతో కేసుకు సంబంధించి ఇప్పటికి 60 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని పోలీసులు వీధి, వీధి గాలింపు చర్యలు చేపట్టడంతో.. పక్కీర్‌ పల్లెలోని అందరినీ అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామస్తులు గ్రామం వదిలి వెళ్లిపోయారు.

మాకేం తెలియదని మహిళల ఆందోళన

గ్రామంలోని మహిళలు మాత్రం తమకు గానీ, తమ గ్రామానికి చెందిన ప్రజలకు ఏమీ తెలియదని, బాలికను రేప్‌ చేసి చంపేశారని గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతోనే వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వెళ్లామని చెప్పుకొచ్చారు. తామంతా కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారిమని, ఇప్పుడు ఈ కేసు వల్ల తమకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.

పక్కీర్‌పల్లె.. ఖాళీ1
1/1

పక్కీర్‌పల్లె.. ఖాళీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement