
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బి–జోన్ స్థాయి సీఐఎస్‌సీఈ జోనల్ బ్యాడ్మింటన్ పోటీలను శుక్రవారం స్థానిక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జగన్నాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్–14, అండర్–17, అండర్–19 వయోపరిమితి గల బాల, బాలికలు పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. అండర్–17 బాలుర డబుల్స్‌లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–17లో బాలుర సింగిల్స్‌లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్, చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్‌లు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి.
అండర్–17 బాలికల డబుల్స్‌లో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అండర్–14 బాలుర విభాగంలో గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా, శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు.