
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయానికి సమీపంలో గల కొండపైనున్న రోడ్డులో గురువారం పెద్ద ప్రమాదం తప్పింది. వేంపల్లె వైపు నుంచి చక్రాయపేట వైపు పశువుల మేత కోసం వేరుశనగ గడ్డి వేసుకొని వస్తున్న ట్రాక్టర్.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగి పోయింది. విద్యుత్ వైర్ల సాయంతో అది కింద పడకుండా అలాగే ఉండి పోయింది. ఈ సమయంలో విద్యుత్ ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తు, దేవుడి దయ వల్ల మంటలు చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గండిలో విధులు నిర్వహిస్తున్న ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ విషయం తెలుసుకొని.. హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపి వేయించారు. అనంతరం ట్రాక్టర్‌ను పక్కకు తొలగించారు. చెత్త ట్రాక్టర్ అడ్డుగా నిలబడి పోవడంతో రాయచోటి వేంపల్లె మార్గంలో కొద్ది సేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
మైదుకూరులో విషాదం
మైదుకూరు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంతో మైదుకూరులో విషాదం నెలకొంది. స్థానిక నంద్యాల రోడ్డులోని మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన కమాల్ బాషా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. సంఘటనలో కమాల్ బాషాతోపాటు ఆయన మరదలు మున్ని, మనుమరాలు నదియా మృతి చెందడం.. వాహనంలో ఉన్న మిగిలిన వారు గాయపడటంతో కమాల్ బాషా బంధువులు కన్నీరు అవుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు వెళ్లడానికి ముందు కమాల్ బాషా కుటుంబం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం నెల్లూరుకు వెళ్లిన వారు మంగళవారం ఇంటికి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లినట్టు కమాల్ బాషా ఇరుగుపొరుగు వారు చెప్పారు. విహార యాత్రలో సంతోషంగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో అతని కుటుంబం ప్రమాదానికి గురికావడం పట్ల వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
తప్పిన పెను ప్రమాదం

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్