
స్వర్ణ కడప సాధనకు శ్రమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్ : స్వర్ణ కడప సాధన కోసం అందరూ సమష్టిగా శ్రమించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–పీ4 ఫౌండేషన్ అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. పీ4 ఫౌండేషన్ ద్వారా బంగారు కుటుంబం–మార్గదర్శి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదలను అన్ని విధాలా ఉన్నత స్థాయికి తీసుకు వచ్చేందుకు ధనికుల సాయం తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని వెల్లడించారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా 15 శాతం అభివృద్ధి రేటును పెంచుకుంటూ పోవాలన్నది లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డితోపాటు జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, సీపీఓ హజరతయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లింగాలలో పర్యటించిన ఇన్‌చార్జి మంత్రి
లింగాల : పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన లింగాలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత పర్యటించారు. తమకు తల్లికి వందనం అందలేదని, ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల మంజూరు కోసం వికలాంగ సర్టిఫికెట్లు అందించలేదంటూ పలువురు మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన హామీలనేకాక మరెన్నో హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
ఇన్‌చార్జిమంత్రి సవిత