
పదోన్నతి జాబితాలో సీఐలు
కడప అర్బన్: రాయలసీమ జోనల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూనే డీఎస్పీలుగా పదోన్నతుల కోసం వేచివున్న దాదాపు 48 మంది సీఐల జాబితా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. వీరిలో 1995 నుంచి 1996 బ్యాచ్‌కు చెందిన వారే అధికంగా వున్నారు.
7,8 తేదీల్లో జిల్లాలో
షర్మిల పర్యటన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు గురువారం డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. 7న కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళి అర్పిస్తారని వివరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రొటెక్షన్ వాచర్‌పై
ఎలుగుబంటి దాడి
ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన వెంకటయ్యపై ఎలుగుబండి దాడి చేసింది. వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యా యి. ఆయనను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు.
రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా
చింతకొమ్మదిన్నె: ఊటుకూరు సమీపంలోని ప్రకృతినగర్‌లోగల రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు యూజీసీ ఈ సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ నెల్సన్ తెలిపారు. నాక్ గ్రేడ్ సాధించినందుకు, మౌళిక వసతులు కల్పించడం, నిష్ణాతులైన ఆచార్య బృందం కలిగి ఉండడం వలన యూజీసీ వారు రామిరెడ్డి ఫార్మసీ కళాశాల కు స్వయంప్రతిపత్తి కల్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ గౌతంరెడ్డి, సెక్రటరీ జయసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ నెల్సన్ కుమార్, కోఆర్డినేటర్ మనోహర్ లను ప్రత్యేకంగా అభినందించారు. కరెస్పాండంట్ గౌతంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు, తల్లితండ్రులకు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహ,రాజారాం,సుచరిత,కల్పన,సలోమి,సుమలత, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.