అధికార పార్టీ నేతలా.. మజాకా..
ప్రొద్దుటూరు: వక్ఫ్‌బోర్డుకు సంబంధించి ఆక్రమ ణలను తొలగించేందుకు వచ్చిన అధికారులు.. అధికార పార్టీ నేతల దెబ్బకు వెనక్కి వెళ్లిన సంఘటన మంగళవారం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. మళ్లీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మోడంమీదపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 278/1లో అధికార పార్టీ నేత నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించాలని స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వనాథనాయుడు ఆదేశించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక డీసీఎస్‌ఆర్ కాలనీ వెనుక, సినీ హబ్ బైపాస్ రోడ్డు మధ్యన 11 సెంట్ల విస్తీర్ణంలో బొల్లవరానికి చెందిన అధికార పార్టీ నేత కారు పార్కింగ్ కోసం నిర్మాణ పనులు చేపట్టాడు. గత కొద్ది రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తున్న షేక్ మాబు షరీఫ్ ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు డీఆర్‌ఓ ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ప్రొద్దుటూరు తహసీల్దార్, కొత్తపల్లె గ్రామ పంచాయతీ సెక్రటరీ, టూటౌన్ ఎస్‌ఐలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్‌బోర్డు ఆఫీసర్ వశీం, మండల సర్వేయర్ వెంకటలక్ష్మి మంగళవారం మరో మారు సర్వే నిర్వహించారు. ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా అధికార పార్టీ నేతలు అడ్డుపడటంతో చివరికి అధికారులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదుదారుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి రాకుండా కేవలం తమ సిబ్బందిని మాత్రమే తప్పించి తప్పుకొన్నారు. సంఘటన స్థలంలో సర్వేయర్‌లు సుధాకర్, రాఘవ, వీఆర్‌ఓ రవి, కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి వరికూటి రామమోహన్‌రెడ్డి ఉన్నారు.
ఎకరా రెండు సెంట్ల స్థలం కబ్జా
కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మోడంమీదపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 278/1లో మొత్తం 1.02 ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలం ఉంది. ఈ స్థలం విలువ ప్రస్తుతం సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. 1943 జూన్ 17న మోడంమీదపల్లె మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. పోతుల పాపయ్య కుమారుడు సుబ్బయ్య ఈ స్థలాన్ని అప్పట్లో విక్రయించిన రికార్డులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాయి. గెజిట్‌లో ఈ వివరాలను పొందుపరిచారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఒక్కొక్కటిగా వక్ఫ్‌బోర్డు స్థలాలు ప్రొద్దుటూరులో కబ్జాకు గురవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎకరా రెండు సెంట్ల స్థలాన్ని కూడా ఆక్రమించారు. ఈ స్థలంలోని 33 సెంట్లలో గతంలో ఆరుగురు శాశ్వత గృహలను నిర్మించారు. గతంలోనే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుతం 10 సెంట్ల స్థలంలో ఛాయ్ సెంటర్, మరో 10 స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా, కొత్తగా 11 సెంట్ల స్థలంలో కారు పార్కింగ్ పనులను ప్రారంభించారు. సమస్య తీవ్రత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డీఆర్‌ఓ ఆదేశాల మేరకు తొలగించేందుకు వచ్చి అధికార పార్టీ నేతల దెబ్బకు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
వక్ఫ్‌బోర్డు స్థలం ఆక్రమణను తొలగించేందుకు వచ్చి వెనక్కి వెళ్లిన అధికారులు
డీఆర్‌ఓ ఆదేశాలు ఇచ్చినాపరిష్కారం కాని సమస్య
అధికార పార్టీ నేతలా.. మజాకా..


