నిన్నటి దాకా ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు నేటి
సాక్షి ప్రతినిధి, కడప: వేసవి సెలవులంతా ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక ఆటపాటలకు టాటా చెబుతూ చదువుల బాటకు వెల్‌కం చెబుతున్నారు. గురువారం నుంచి పిల్లలంతా బుద్ధిగా పుస్తకాల బ్యాగ్‌ను భుజాన వేసుకుని బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పెండింగ్‌లో ఉంది. మరో రెండు రోజులు కౌన్సెలింగ్ కొనసాగించాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్స్ కిట్స్ చేరలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసౌకర్యాల మధ్య ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు సంసిద్ధులయ్యారు.
జిల్లాలో 2,816 విద్యాసంస్థలు..
వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 2816 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,05,330 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పేరుతో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు 2,042 ఉన్నాయి. వీటిల్లో 1,37,352 మంది విద్యార్థులున్నారు. అలాగే ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 774 ఉన్నాయి. వీటి పరిధిలో 1,67,978 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యాసంస్థలన్నీ గురువారం నుంచి ప్రారంభించి నూతన్య విద్యా సంవత్సరం కొనసాగించనున్నారు.
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
జిల్లాలో తలుపులు తెరుచుకోనున్న 2,816 స్కూళ్లు
బడిబాట పట్టనున్న 3,05,330 మంది విద్యార్థులు
పూర్తి స్థాయిలో చేరని స్టూడెంట్స్ కిట్లు
చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి: డీఈఓ షంషుద్దీన్
జూన్ 12 నుంచి యధావిధిగా అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెరుగైన విద్యా బోధన, వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజు వీడి ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో మూస పద్ధతిలో బట్టీ చదువులకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
నిన్నటి దాకా ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు నేటి


