డీజిల్ దొంగతనంపై విచారణ
చాపాడు : బెంగళూరు – విజయవాడ మధ్య జరుగుతున్న గ్రీన్‌ఫీల్డు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో బుధవారం జరిగిన డీజిల్ దొంగతనంపై శనివారం ఏఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు. ఎర్రగుడిపాడు–ఆదిరెడ్డిపల్లె ప్యాకేజి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మండలంలోని రామసుబ్బమ్మకొట్టాలు గ్రామ సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ రామసుబ్బమ్మ కొట్టాలు–పెద్దగురువళూరు, కుచ్చుపాప, వెదురూరు గ్రామాలకు వెళ్లే క్రమంలో రోడ్డుపై వంతెన నిర్మిస్తున్నారు. పనులు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఇక్కడ ఉన్న హిటాచీ వాహనం నుంచి 200 లీటర్ల మేరకూ డిజిల్‌ను అపహరించినట్లు రోడ్డు నిర్మాణ ప్రతినిధులు గుర్తించారు. రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం ఏఎస్‌ఐ సంఘటనా స్థలం వద్ద విచారించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వర్కర్లను విచారించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
రెండు ఆటోలు దగ్ధం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసంటున్న శివ, కుళ్లాయి బాషాలకు చెందిన రెండు ఆటోలకు శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వీరిద్దరూ ఆటోలను పెట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మద్యం తాగుతున్న వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి, ఎస్‌ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


