చుక్కల మందుతో చక్కని జీవితం
● 21న బూత్ స్థాయిలో.. 22,23న ఇంటింటికీ
● ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు
● నేడు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం జరగనుంది. 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి అంతకు ముందు రోజు చుక్కల మందును వేయించిన చిన్నారులకు, వైద్య సిబ్బంది చుక్కల మందును వేస్తారు. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా అప్పుడే జన్మించిన వారితో పాటు ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కల మందును వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంఽధించి ఆ శాఖ అన్ని చర్యలు చేపట్టింది.
● ఇప్పటికే క్షేత్ర స్ధాయిలో పల్స్ పోలియో చుక్కల మందు వేసే బూత్‌లను ఏర్పాటు చేశారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కూడా చుక్కల మందును వేస్తారు. ప్రత్యేకంగా మొబైల్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
● ప్రధానంగా హైరిస్క్ ప్రాంతాలపై దృష్టి సారించారు. అందులో మురికి వాడలు, సంచార జాతులు, భవన నిర్మాణ కార్మికులు ఉండే ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ఉండే చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. అలాగే సంచార జాతులు, వలస, వ్యవసాయ కూలీలు, ఇటుక బట్టీల్లో పని చేసేవారి పిల్లలపై ప్రత్యేక దృిష్టిని కేంద్రీకరించారు.
● 1995 నుంచి ‘పల్స్ పోలియో’ ప్రారంభం ఈ పల్స్ పోలియో అన్ని దేశాలను కలవర పెట్టిందనే చెప్పవచ్చు. కాగా 1995లో దేశవ్యాప్తంగా పోలియో వలన అధికారికంగా 35 వేల మంది బాధపడేవారు. అందులో చాలా మంది చనిపోయారు. దీంతో ‘పోలియో’ను తరిమి కొట్టడానికి నాటి నుంచి చుక్కల మందును వేస్తున్నారు. పల్స్ అంటే ఒకేసారి.. పోలియో అంటే వైరస్. ఈ వైరస్‌ను పూర్తిగా తుదముట్టించాలంటే అందరికీ ఒకేసారి మందును వేయాలి. కనుక పల్స్‌పోలియో కార్యక్రమం రూపుదిద్దుకుంది. తరువాత పోలియో కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. చివరగా దేశంలో 2011 జనవరి 11న పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక కేసు నమోదైంది. మన రాష్ట్రానికి సంబంధించి 2008లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదు కాగా జిల్లాలో 2003లో కడప నగరం రవీంద్రనగర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.
వైరస్ కారణంగా ‘పోలియో’..
ఈ పోలియో ‘వైరస్’ కారణంగా వస్తుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఉదాహరణకు వైరస్ ఉన్నవారు ఆరుబయట బహిర్భూమికి వెళతారు. అదే చోటికి మరొకరు వెళ్లి ఆ ప్రాంతంలో చేతులుపెట్టి, ఆ చేతులను నోట్లో పెట్టుకోవడంతో వైరస్ సోకుతుంది. అలాగే వాతావరణం ద్వారా, పరిశుభ్రత కారణంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోలియో కారణంగా శరీరంలో కాలు, చేయి తదితర అవయవాలు సచ్చు బడిపోతాయి. ఒకవేళ ఊపిరితిత్తులకు సోకితే మరణం కూడా సంభవిస్తుంది. అందుకే శరీరంలోని పోలియో వైరస్‌ను అంతం చేయడానికి రెండు చుక్కల మందును వేయించడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ విషయం మరుగుదొడ్ల ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది.
ఆనవాయితీ తప్పింది..
సాధారణంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని జాతీయ స్ధాయిలో ఒక ఏడాదికి మొదటి విడత జనవరిలో, రెండవ విడత ఫిబ్రవరిలో నిర్వహించేవారు. అయితే గత మూడేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా ఒక డోసు మాత్రమే పిల్లలకు చుక్కల మందు వేస్తున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా చుక్కల మందును వేయలేదు. 2024లో చుక్కల మందును వేశారు. తాజాగా ప్రస్తుతం ఈ ఏడాది పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఈ అంశాన్ని తల్లిదండ్రులు, పెద్దలు గమనించి తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా చుక్కల మందును వేయించాలి.
ఈ సారి క్రిస్మస్, జనవరి, సంక్రాంతి పండుగలకు ముందే చిన్నారులకు చుక్కల మందు పండుగ వచ్చేసింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం జరగనుంది. పెద్దలు తమ పిల్లలకు చుక్కల మందును వేయించి, వారికి చక్కని జీవితాన్ని అందించడానికి దోహదపడాలి.
చుక్కల మందుతో చక్కని జీవితం


