ఇంటర్ నూతన పరీక్షా విధానంపై అవగాహన సదస్సు
కడప ఎడ్యుకేషన్ : జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ –2020) అనుగుణంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2025–26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ టీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో శనివారం 2025– 26 విద్యా సంవత్సరం నుంచి మారిన ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో తెచ్చిన సమూల మార్పులపై కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, ిపిన్సిపల్స్‌కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఈ 2026 పబ్లిక్ పరీక్షలలో రెండవ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం పూర్తిగా కొత్త విధానంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షల విధానం అమలు చేస్తారన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఈఆర్‌టీడబ్ల్యూ) జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు గణిత సబ్జెక్టుల్లో 150 మార్కులకు 1ఏ, 1బి లుగా రెండు పేపర్లు వేర్వేరు రోజుల్లో ఉండేవన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం ఒకే పేపర్ గా 100 మార్కులకు ఒకే రోజు ఉంటుందన్నారు. అలాగే గతంలో బాటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు వేర్వేరు పేపర్లు, వేర్వేరు రోజుల్లో పరీక్ష నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం నుంచి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష 85 మార్కులకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఒకేరోజు రెండు విడివిడి సమాధాన పత్రాలలో బాటనీ, జువాలజీకి సంబంధించిన సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అడిషనల్ సబ్జెక్టుగా, బైపీసీ విద్యార్థులు గణిత సబ్జెక్టును అడిషనల్ సబ్జెక్టుగా ఎంచుకొని ఎం బైపీసీ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. గత సంవత్సరం ఉన్న సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.


