క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..!

Jun 11 2025 9:08 AM | Updated on Jun 11 2025 9:10 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : చదువుతో పాటు చిన్నారులు క్రీడల్లోనూ రాణించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు వేళయింది. ఆయన హయాంలో కడప శివారులో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో నాటి నుంచి నేటి వరకూ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటారు. ఎంతోమంది ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి చేరారు. ఈ ఏడాది క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందితే మంచి భవిష్యతు ఉంటుందని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను సిద్ధం చేస్తున్నారు.

19వ తేదీ వరకూ గడువు

ఆన్‌లైన్‌ ద్వారా మే 31వ తేదీ నుంచి జూన్‌ 19వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 4వ తరగతిలో 40 సీట్లకు గానూ బాలురు–20, బాలికలు–20, 5వ తరగతిలో మొత్తం 40 సీట్లకు గాను బాలురు–20, బాలికలు –20 మందికి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపికలు జరిగేవి. ఈ ఏడాది నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఎంపికలు నిర్వహించనున్నారు. 4వ తరగతి ప్రవేశానికి 01–04–2015–31–03–2017 మధ్య జన్మించిన వారు, ఐదో తరగతికి 01–04–2014 నుంచి 31–03–2016 మధ్య జన్మించిన వారు అర్హులవుతారు. వయస్సు ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుడి ఒరిజినటల్‌ డాక్యుమెంట్లు, వైద్య పరీక్షల తర్వాత జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది.

ఎంపికలు ఇలా.....

జిల్లా స్థాయిలో ఈ ఏడాది జులై 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు కడప డీఎస్‌ఎ స్టేడియంలో చేపట్టనున్నారు. 30 మీటర్ల ప్లయింగ్‌ స్టార్ట్‌ , స్టాడింగ్‌ బ్రాండ్‌ జంప్‌, మెడిసిన్‌ బాల్‌, షటిల్‌ రన్‌, ప్లెక్సీబిలిటీ టెస్ట్‌, 800 మీటర్ల పరుగు పందెం వంటివి నిర్వహిస్తారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాస్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి శారీరక సామర్థ్య ఎంపికలను ఈ ఏడాది జులై 10, 11వ తేదీల్లో నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనపరిచిన వారు క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిలుస్తారు. జులై 24వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

జులై 1 నుంచి జిల్లా స్థాయి ఎంపికలు

దరఖాస్తు చేసుకోవాలి

వచ్చే విద్యా సంవత్సరానికి కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. అర్హత ఉండి ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

–జగన్నాథరెడ్డి, ఇన్‌చార్జ్‌ డీఎస్‌డీవో, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..!1
1/1

క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement