
ఆశయ సాధనకు మారుపేరు ‘మహర్షి’
● జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
కడప సెవెన్‌రోడ్స్: అకుంఠిత దీక్ష, పట్టుదల, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి జీవిత సారాంశం తెలుపుతుందని.. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ఎస్ హాలులో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో పాటు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆశయ సాధన, అకుంఠిత దీక్ష కు నిలువెత్తు నిదర్శనం అపర భగీరథ మహర్షి అని కొనియాడారు. రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి మాట్లాడుతూ మన జిల్లా వాసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు సాగు నీరందించాలనే గొప్ప ఆశయంతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి అపర భగీరధుడయ్యారని గుర్తు చేశారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి మాట్లాడారు. అంతకుముందు భగీరథ మహర్షి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీ జయసింహ, జిల్లా బీసీ వెల్ఫర్ అధికారి రాజ్యలక్ష్మి, బీసీ సంఘ నేత అవ్వారు మల్లికార్జున, జాతీయ ఎస్టీ, ఎస్సీ సంఘం అధ్యక్షులు జెవి రమణ పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన నీట్
కడప సెవెన్‌రోడ్స్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్–2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించడం తొలిసారి కావడంతో జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించలేదు. తమ పిల్లలు పరీక్ష రాస్తుండడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద నిరీక్షించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
● జిల్లాలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 2371 మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకోగా 2311 మంది హాజరు కాగా, 60 మంది గైర్హాజరయ్యారు.

ఆశయ సాధనకు మారుపేరు ‘మహర్షి’