
జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో జిల్లాలోని పలు సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. కడప– రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులకు రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ ఇంతవరకూ ఆ పనులు ప్రారంభించలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు లేవని పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. అలాగే కడప నగరంలో ఉన్న సీపీ బ్రౌన్ లైబ్రరీకి సంబంధించి గత ప్రభుత్వంలో అదనపు గదుల నిర్మాణం కోసం 6.80 కోట్లు మంజూరైందని, ఆ పనులు ఇంకా ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టను టూరిజం కేంద్రంగా మార్చి అక్కడున్న చెరువులో బోట్లను నడపాలని సూచించారు. కడప నగర సుందరీకరణలో భాగంగా బుగ్గవంక చుట్టూ 8 కీ.మీల మేర అప్రోచ్ రోడ్లు వేయాల్సి ఉండగా, ఇప్పటికీ 3 కీ.మీల రోడ్డు మాత్రమే పూర్తయ్యిందని, మిగిలిన రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. కమలాపురం–కడప రహదారిలో పాపాగ్ని నదిపై నిర్మించిన కొత్త వంతెన నిర్మాణం కొంత భాగంగా ఇంకా పెండింగ్‌లోనే ఉందని, దాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, 9నెలల కాలం గడుస్తున్నా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 12వ పీఆర్‌సీపై కమిటీ వేసిందని, ఆ కమిటీ రద్దయ్యిందని, కొత్త కమిటీ వేసి 12వ పీఆర్‌సీ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు, పోలీసులకు ఇవ్వాల్సిన డీఏ, ఐఆర్, జీపీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా ప్రస్తావించానని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒంటిమిట్టను టూరిజం కేంద్రంగా మార్చాలి
కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ హైవే
రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు
బుగ్గవంక అప్రోచ్ రోడ్డు పనులు
పూర్తి చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్