
చెరువు మట్టి.. చెరబట్టి
ఖాజీపేట : కొత్త చెరువులు నిర్మించక పోయినా పర్వాలేదు కానీ.. ఉన్న చెరువులకు నష్టం కల్గకుండా అధికారులు చర్యలు తీసుకుంటే చాలని రైతన్నలు అంటున్నారు. పూర్వం నిర్మించిన చెరువులను రోడ్డు నిర్మాణం కోసం అనుమతులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు కాంట్రాక్టర్లు చెరువును తవ్వేస్తూ ధ్వంసం చేస్తున్నారు.. ఫలితంగా మా చెరువును కాపాడండి మహాప్రభో అంటూ నాగసానిపల్లె రైతులు ఆందోళన చేశారు. అధికారులు పట్టించుకోలేదు. తాజాగా శనివారం ఎస్టీకాలనీ వాసులు చెరువు మట్టిని తరలించకుండా అడ్డుకున్నారు. వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు.
ఒండ్రు మట్టిపై కాంట్రాక్టర్ల కన్ను
ఖాజీపేట మండలం నాగసానిపల్లె చెరువు పూర్తిగా మంచి ఒండ్రు మట్టితో నిండి ఉంది. ఆ మట్టిపై కొందరు క్రాంట్రాక్టర్లు కన్నెశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్న సాగుచూపి పెద్ద ఎత్తున జేసీబీలు, టిప్పర్ల పెట్టి తవ్వకాలు మొదలు పెట్టారు.. తెల్లవారుజాము నుంచి రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఇలా నాలుగు నెలల నుంచి చెరువు నుంచి మట్టిని తన్నుకుపోతున్నారు.
చెరువులో నీరు నిల్వ కష్టమే..
కన్నెలవాగు చెరువులోకి నీరు పూర్తిగా వర్షపాతం వల్ల వస్తుంది. కొండల్లో వర్షం పడితే నీరు చేరుతుంది.. లేక పోతే నీరు వచ్చే అవకాశం లేదు. ప్రతి మూడు లేక నాలుగు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే వర్షం వల్ల చెరువు నిండుతుందని స్థానికులు అంటున్నారు.. చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులుకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే చెరువులో మట్టిని కనిష్ట స్థాయికి తవ్వేస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న చెరువు నుంచి సుమారు 15 అడుగుల లోతు మట్టిని తవ్వేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తూము మద్ద కంటే చాలా దిగువకు మట్టిని తీస్తున్నారు. చెరువు దిగువన గలుగు రాయి వచ్చే స్థాయికి మట్టిని తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల చెరువులో నీరు నిల్వ ఉండటం కష్టమే అని రైతులు అంటున్నారు. ఒక వేళ నీరు చేరినా తూము పైభాగం వరకు నీరు చేరేది కష్టమే అని రైతులు అంటున్నారు. పైన ఉన్న సారవంతమైన మట్టిని పూర్తిగా తొలగించడం వల్ల నీరు నిల్వ ఉండే అవకాశం లేదంటున్నారు. ఫలితంగా వచ్చిన నీరంతా భూగర్భంలోకి త్వరగా ఇంకిపోతుందని అంటున్నారు.. దీనివల్ల చెరువులో నీరులేక, భూగర్భ జలాలు ఇంకిపోయి రైతుల బోర్లకు నీరు అందని పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు.
నిబంధనలకు పాతర
జాతీయ రహదారి నిర్మిణం కోసం చెరువులో మట్టిని తవ్వుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే నిబంధనలకు పాతర వేశారు. 10 అడుగుల కంటే మించకూడదని, తూము కంటే దిగువకు మట్టిని తియ్యరాదని అంటున్నారు. కానీ 15 అడుగుల లోతు తీసున్నారు. 2లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే అంతకు మించి తవ్వుతున్నారని రైతులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ అవసరాలకు అయితే ఒక క్యూబిక్ మీటరుకు రూ. 50 నుంచి రూ. 60 చెల్లించాలి.. అదే కమర్శియల్ అవసరాలకు అయితే రూ.135 నుంచి 140 చెల్లించాలి.. కానీ ఎంత రాయల్టీ చెల్లించారు.. ఎంత మట్టిని తరలించారు..అనుమతులకు మించి ఎమైనా మట్టిని తవ్వుతున్నారా.. ఎంత వరకు అనుమతులు ఉన్నాయి అని రైతులు అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు కాంట్రాక్టర్లు మాత్రం రాయల్తీ చెల్లించామని, అన్ని అనుముతులు ఉన్నాయని స్థానికులకు చెప్పడం విశేషం.
ఐదు రోజులుగా నిరసనలు
చెరువులోని మట్టిని తరలించవద్దు అంటూ నాగసానిపల్లెలోని ఎస్టీకాలనీ వాసులు ఐదు రోజుల నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. చెరువు నుంచి మట్టిని తరలించుకు పోయే ప్రధాన రహదారికి అడ్డుగా మట్టి కుప్పలు వేసి అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వచ్చి బెదిరించినా భయపడకుండా మా చెరువు నుంచి మట్టిని తీసుకు పోనివ్వం అని తెగేసి చెబుతున్నారు.
పోలీసులతో బెదిరింజులు
మట్టిని తరలించుకునేందుకు అవకాశం కల్పించక పోతే మీపై కేసులు పెడతామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అయితే మీకు మట్టి కావాలంటే ఎక్కడ నుంచైనా తీసుకోవచ్చు.. మా భూములకు నీరు కావాలంటే ఎలా వస్తుందని రైతులు కాంట్రాక్టర్లను గ్రామస్తులు ప్రశ్నంచారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను పంపించారు. మీపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. దారి వదలక పోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. కేసులకు భయపడేది లేదని భూములు పోతే మా బతుకు పోతుందని నిరసన కొనసాగిస్తునామన్నారు.
పంటలు దెబ్బతింటున్నాయి
చెరువు నుంచి మట్టిని రోజు తరలించడం వల్ల వచ్చే దుమ్ము వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. నష్టం భరించలేక రైతులు కోపంతో వాహనాలను ఆపి గతంలో రెండు సార్లు ధర్నలు చేశారు. అయితే పంట నష్టం పరిహారం ఇస్తామని చెప్పి నిరసన ఆపించారు. అయితే రైతులకు పరిహారం పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ స్వర్థం కోసం రైతులు నష్టపోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల తీరుపై మండిపాటు
స్థానిక అవసరాల కోసం రైతులు ఎదైనా మట్టిని తరలిస్తే అధికారులు ఆఘమేఘాలపై స్పందిస్తారు.. వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ ఫెనాల్టీలు వేసి రైతులను ఇబ్బందికి గురిచేస్తారు. అయితే మట్టిని కాంట్రాక్టర్లు తవ్వుకుంటూపోతున్న.. తెలిసి పట్టించుకోక పోవడంపై రైతులు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మట్టిని తరలిస్తున్న విషయం స్థానికులు తహసీల్దార్, పోలీసులు, చిన్ననీటి పారుదల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించక పోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.
నాగసానిపల్లె చెరువులో
ఇష్టారాజ్యంగా త్వకాలు
నాలుగు నెలలుగా ఇదే తంతు
నిబంధనలకు మించి తవ్వకాలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మట్టి తవ్వాకాలను అడ్డుకున్న
ఎస్టీకాలనీ వాసులు

చెరువు మట్టి.. చెరబట్టి