కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీలో కొన్ని అసాంఘిక శక్తులు పని చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా ఆరోపించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులే గ్యాంబ్లిగ్, బెట్టింగ్‌లు నిర్వహిస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. జూదం ఆడిస్తున్నారనే కారణంతో రెండు రోజుల క్రితం రాజారెడ్డి వీధికి చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తిని అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అతను వైఎస్సార్‌సీపీ నాయకుడని అని కొన్ని పత్రికల్లో కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అతను వైఎస్సార్‌సీపీ నాయకుడని రాయడం సరికాదన్నారు. రాజారెడ్డి వీధికి చెందిన అశోక్‌రెడ్డి పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడని, లక్ష రూపాయలు చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో సీఎస్‌ఐ స్కూల్‌లో టీడీపీ తరఫున ఏజెంట్‌గా కూర్చొన్నారని, కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి ముఖ్య అనుచరుడన్నారు. లక్షలు, లక్షలు చేతులు మారుస్తూ జూదం ఆడించే గ్యాంబ్లర్‌కు 41ఏ నోటీసులిచ్చి వదిలేయడం వెనుక ఎవరి హస్తం ఉందో వెలికి తీయాలన్నారు. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, గంజాయి సరఫరా చేసే వారికి కూడా ఇలానే నోటీసులిచ్చి వదిలేస్తారా.. పోలీసులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో ఏది జరిగినా వైఎస్సార్‌సీపీపై బురదజల్లడం ఆనవాయితీగా మారిందన్నారు. భూదందాలు ఎవరు చేస్తున్నారు, మట్టి, ఇసుక మాఫియా ఎవరి చేతుల్లో ఉందనేది జగమెరిగిన సత్యమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం ముందు తన, మన అనే భేదం లేకుండా పాలన సాగిందన్నారు. వైఎస్ కొండారెడ్డి కాంట్రాక్టర్‌ను బెదిరిస్తే తన బంధువైనా సరే వైఎస్ జగన్ సహించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మాత్రం ఆసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిని ప్రోత్సహిస్తున్నారని, సామాన్యులకు ఒక న్యాయం, టీడీపీ వారికి మరొక న్యాయం అనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, రమేష్‌రెడ్డి, షఫీ, గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జూదం ఆడిస్తూ పట్టుబడిన వ్యక్తి వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాదు
అశోక్‌రెడ్డి టీడీపీ 24వ డివిజన్ ఇన్‌చార్జి
లక్ష రూపాయలు పెట్టి టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారు
మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా