
లారీ దూసుకెళ్లి..భార్యాభర్తలు మృతి
మైదుకూరు : కష్టపడి పంట పండించే రైతులు ఆ భార్యాభర్తలు. రోజుమాదిరిగానే పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డుపై ఉండగా వేగంగా వచ్చిన లారీ వారిపై దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భార్య, భర్తలు తిరిగిరాని లోకాలకు చేరారు. వారి కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. చాపాడు మండలం తప్పెట ఓబాయపల్లెకు చెందిన పసుపులేటి చలమయ్య కుటుంబం 30ఏళ్ల కిందట మైదుకూరుకు వచ్చి స్థిరపడింది. పట్టణంలోని నంద్యాల రోడ్డు సీతారామాంజనేయనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు మల్లేష్‌కు వివాహం కాగా, రెండో కుమారుడు వినోద్ కుమార్ డిగ్రీ వరకు చదివి కడపలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. చలమయ్య మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లె వద్ద ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినోద్ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పొలంలో సాగు చేసిన పసుపు పంట ఆకు కోయడంతో దానిని తొలగించేందుకు శుక్రవారం భార్య, కుమారుడు వినోద్‌తో కలిసి చలమయ్య పొలానికి వెళ్లారు. పొలం పని అయిపోగానే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిపైకి చేరుకొని ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మాచర్ల నుండి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ వీరిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చలమయ్య (55), ఆయన భార్య లక్ష్మీదేవి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు వినోద్ కుమార్‌కు గాయాలవడంతో కడప రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ సీఐ హాసం పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడికి తీవ్ర గాయాలు
పొలానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

లారీ దూసుకెళ్లి..భార్యాభర్తలు మృతి