
ప్రభుత్వానికి తెలియకుండా కట్టడాలు కూల్చివేస్తారా
కాశినాయన : ప్రభుత్వానికి తెలియకుండా జ్యోతి క్షేత్రం కాశినాయన ఆశ్రమంలోని నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. కాశినాయన మండలంలోని జ్యోతిక్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కాశినాయన సమాధి, లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాశినాయన ఆశ్రమంలో అటవీశాఖ అధికారులు అనుమతులు లేవంటూ కూల్చివేసిన గోశాల, క్షౌ రశాల, వసతిగదులు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణుల సత్రాలు, మరుగుదొడ్లతో పాటు భోజనశాల, వంటశాలలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది మంది కాశినాయన సమాధిని దర్శించుకుని భోజనం చేసి వెళుతుంటారన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న కాశినాయన ఆశ్రమంలో అనుమతి లేకుండా కట్టడాలు కట్టారని కూల్చివేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారులు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమానికి 12.98 హెక్టార్ల భూమి అవసరమని, ఇందుకు సంబంధించి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖను తాను, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు కొంత మంది ఆలయ నిర్వాహకులు ఢిల్లీ వెళ్లి అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డికి అందజేశామన్నారు. ఆయన కేంద్ర అటవీశాఖ మంత్రికి లేఖను అందజేసి అనుమతులు మంజూరు చేయాలని కోరారన్నారు. తాను పలుమార్లు ఢిల్లీలోని అటవీశాఖ అధికారులతో మాట్లాడానని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఫారెస్టు అధికారులతో చర్చలు జరుపుతూ కాశినాయన ఆశ్రమానికి తోడ్పాటు అందించామని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం 8 నెలల్లో మూడుసార్లు ఆశ్రమంలోని నిర్మాణాలను కూల్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తెలియకుండా అటవీ అధికారులు కూల్చివేశారని మంత్రి లోకేష్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర అటవీశాఖ అధికారుల ఆదేశాలతో ఇప్పటి జిల్లా కలెక్టర్ జనవరి 1న కాశినాయన ఆశ్రమంలోని కట్టడాలను కూల్చివేయాలని పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఏపీఎస్‌పీడీసీఎల్, అటవీశాఖ అధికారులకు జీఓ జారీ చేశారని తెలిపారు. రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన ప్రకారం 12.98 హెక్టార్ల భూమికి అనుమతి మంజూరు చేయించి కాశినాయన ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని ఇక్కడ భక్తులే నిర్వహిస్తున్నారని, అలాంటి ఆశ్రమాన్ని అనుమతుల పేరుతో కూల్చివేయడం తగదన్నారు. మంత్రి లోకేష్ అధికారులను తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేనిదే అధికారులు ఎలా కట్టడాలను కూల్చివేస్తారని ప్రశ్నించారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ అవధూతగా పేరు పొందిన కాశినాయన ఆశ్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూల్చివేతలు మొదలు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు ఆదిత్యరెడ్డి, మాజీ వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాశినాయన భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
కడప పార్లమెంటు సభ్యుడు
వైఎస్ అవినాష్‌రెడ్డి