మహిళా కార్మిక హక్కుల రక్షణకు పోరాటం
ప్రొద్దుటూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు పని భద్రత, రక్షణ చట్టాలను అమలు చేయాలని, మహిళా కార్మిక చట్టాల, హక్కుల రక్షణ కోసం పోరాటానికి సమాయత్తం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. స్థానిక ప్యారడైజ్ ఎస్డీఎస్ ఫంక్షన్ హాల్‌లో స్కీం కార్మికుల రెండు రోజు రాష్ట్రస్థాయి సైద్ధాంతిక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముందుగా ఏఐటీయూసీ జెండాను డాక్టర్ పి.సంజీవమ్మ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేసే చోట అభద్రతాభావంతో పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి భద్రత కల్పించి, వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాలక ప్రభుత్వాలు మహిళా సాధికారత దిశగా అడుగులు వేయకుండా మహిళల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్స్ స్కావెంజర్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరూ పేద కార్మికులన్నారు. వారి వేతనాల పెంపునకు ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వీడాలన్నారు. హెల్త్ అండ్ ఆటిట్యూడ్ అనే అంశంపై నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవాధ్యక్షురాలు అరుణ వివరించారు. లింగ వివక్షత అనే అంశంపై డాక్టర్ పి.సంజీవమ్మ, మహిళలను సంఘటితం చేయడంలో ట్రేడ్ యూనియన్ పాత్ర అనే అంశంపై ఏఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.ఓబులేసు, అసంఘటిత రంగం– మహిళా సమస్యలు అనే అంశంపై వెంకటసుబ్బయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, స్కీం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు లలితమ్మ, మంజుల, బాబు, రమేష్, శాంతి, బాలకృష్ణ, స్రవంతి, సుభాషిణి, రాష్ట్ర వ్యాప్తంగా స్కీం కార్మిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


