ముద్దనూరు : మండలంలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన రేణుక(19) అనే వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేష్ బాబు సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం తాండూరు మండలం కరెంకోట్ గ్రామానికి చెందిన ఈమె ఈ ఏడాది మే 3వ తేదీన చౌటిపల్లె గ్రామానికి చెందిన రంగారె డ్డిని వివాహం చేసుకుంది. శనివారం ఉదయం రంగారెడ్డి వ్యక్తిగత పనిమీద కొండాపురం వెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో భార్య రేణుకకు ఫోన్ చేసి మాట్లాడాడు. తిరిగి కొద్దిసమయం అనంతరం మళ్లీ ఫోన్ చేయగా భార్య ఫోన్ స్విచ్ ఆఫ్‌గా ఉంది. దీంతో రంగారెడ్డి అతని తండ్రి రామిరెడ్డిని ఇంటికి వెళ్లి చూడమని తెలిపారు. అయితే రామిరెడ్డి ఇంటికి వెళ్లి చూడగా రేణుక ఇంటిలో లేదు. తన భార్య కనిపించడం లేదని రంగారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.