ఎర్ర బంగారానికి నల్ల తామర
మద్దిరాల : మిరప పంటకు నల్లతామర తెగులు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగులు కారణంగా పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో మండలంలోని చాలా మంది రైతులు మిరపను సాగు చేశారు. ఆ తరువాత పరిస్థితి అనుకూలించడంతో పంటచేలు ఏపుగా పెరిగాయి. ఆ తరువాత వరుస తుపాన్ కారణంగా అధికంగా వర్షాలు కురిశాయి. దాంతో మిరప చేలపై నల్లతామర తెగులు ఆశిస్తోంది. వారం రోజులుగా మిరప చేలో పువ్వులపై నల్లతామర ఉధృతి మొదలైంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో తామర పురుగు ఉధృతి అధికంగా ఉంటోంది. నల్ల తామర పురుగులు లేత ఇగుర్లు, మొగ్గలు, పువ్వులు, కాయలను ఆశించి వాటిని నాశం చేస్తాయి. దాంతో దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులు పగలు పువ్వులలో దాక్కొని సాయంత్రం పంటపై దాడి చేస్తాయి. దీని నివారణకు సరైన మందులు లేక కట్టడి చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.
గతంలోనూ ఎక్కువగానే..
2021, 2022లోనూనల్లతామర తెగులు మిరపకు ఆశించింది. అప్పట్లో ఎన్ని పురుగుల మందు వాడినా దానిని నియంత్రించలేక రైతులు నష్టపోయారు. ఆ తర్వాత రెండేళ్లు చీడపీడలు లేవు. మళ్లీ ఈసారి నల్లతామర ఆశించడం, ఇది విదేశీ వలస పురుగు కావడంతో పురుగు మందులు పనిచేయడం లేదని రైతులు చెబుతున్నారు.
మందులు పిచికారీ చేస్తున్నాం
నల్లతామర నివారణకు వారానికి మూడుసార్లు పురుగుల నివారణ మందులను పిచికారీ చేస్తున్నాం. అయినప్పటికీ పురుగులను కట్టడి చేయలేకపోతున్నాం. ఎకరానికి రూ.60వేల పైనే పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు తెగులు కారణంగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– జాటోతు రవి, రైతు, భగవాన్‌తండా
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నల్లతామర నివాణకు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటి నివారణకు డైకోఫోల్ 5ఎంఎల్ లేదా ఎసిటామిఫ్రైడ్ 0.2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేప నూనె 5ఎంఎల్ లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.
– అనిషారూహి, ఏఓ, మద్దిరాల
మిరప పంటను ఆశిస్తున్న తెగులు
దిగుబడి తగ్గే అవకాశం ఉందని
రైతుల ఆందోళన


