చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి | - | Sakshi
Sakshi News home page

చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి

Oct 29 2025 7:16 AM | Updated on Oct 29 2025 7:16 AM

చేలమీ

చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి

రామన్నపేట : మోంథా తుపాను పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పత్తిపంట కళ్లెదుటే తడిసి ముద్దవుతుండడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు చేల ఎదుగుదలపై ప్రభావం చూపగా సెప్టెంబర్‌తోపాటు ఈ నెలలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తిచేలకు నష్టం కలిగిస్తున్నాయి. అధిక వర్షాలకు పత్తిచేలల్లో నీళ్లునిల్చి ఎర్రబారి తెగుళ్లబారిన పడుతున్నాయి. ప్రస్తుతం పత్తి తీసే సమయంలోనూ వర్షాలు కురుస్తుండడంతో పత్తి తడిసి రంగుమారుతోందని రైతులు వాపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తడిసి రంగుమారిన పత్తిని గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.

పత్తితీతకు ఆటంకాలు

జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 1.13 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగైంది. రైతులు ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టారు. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 15క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉండేది. కానీ, సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలకు సరైన పోషకాలు అందక ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీంతో సరైన పూత పూయలేదు. కాత కాయలేదు. గతనెల, ఈనెలలో కురిసిన వానలకు పత్తిచేలలో నీరు నిలిచి తేమ ఎక్కువ కావడం వల్ల పూత, కాయలు రాలిపోయాయి. అధిక తేమవల్ల రసం పీల్చే పురుగులు, తెల్ల, పచ్చదోమ, ఎర్రనల్లి, ఆకుముడుత, పండాకు తెగుళ్లు పంటనాశించాయి. తెగుళ్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. అనేక సమస్యలను అధిగమించి మొదటి (మైల)పత్తి తీసిన రైతులు, నాణ్యమైన పత్తిని తీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరుసగా వానలు కురుస్తుండడంతో త్తితీతకు ఆటంకం కలుగుతోంది. చేలమీదనే పత్తి తడిసి జారిపోతుంది. చిరుజల్లులకు తడిసిన పత్తిని ఆరబెట్టడానికి రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ సారి ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి పెటుబడి ఖర్చులు మిగులుతాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫ వరుస వర్షాలతో పత్తి రైతుల్లో

తీవ్ర ఆందోళన

ఫ పత్తితీతకూ ఆటంకంగా ముసురు

ఫ రంగు మారుతున్న తెల్లబంగారం

ఫ సీసీఐ కేంద్రాలు లేక వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయం

ఫ పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదన

ఈ చిత్రంలోని రైతు పేరు నడిగోటి సైదులు. ఈయనది రామన్నపేట మండలం జనంపల్లి గ్రామం. ఈ యేడు రెండున్నర ఎకరాల్లో పత్తిసాగు చేశాడు. దున్నకం, విత్తనాలు, ఎరువుల కోసం రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు క్వింటాళ్ల దిగుబడి రాగా క్వింటాకు రూ.6వేల చొప్పున అమ్మాడు. చేనును చీడపీడలు ఆశించి ఎండుబారింది. పూత కాయ రాలిపోవడం వల్ల మరో నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదని, చేతికష్టం అటుంచితే పెట్టుబడి మందం కూడా రాని పరిస్థితి నెలకొందని రైతు సైదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలోని పత్తిసాగు చేసిన ప్రతి రైతులు పరిస్థితి ఇలాగే ఉంది.

పత్తిసాగు విస్తీర్ణం 1,13,193 ఎకరాలు

దిగుబడి అంచనా 16 లక్షల క్వింటాళ్లు

ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న దిగుబడి 11 లక్షల క్వింటాళ్లు

కొనుగోళ్ల లక్ష్యం 9 లక్షల క్వింటాళ్లు

ఏర్పాటుకు నిర్ణయించిన సీసీఐ కేంద్రాలు 12

ఇప్పటి వరకు ప్రారంభించినవి 04

కొనుగోళ్లు మొదలైనవి 03

చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి1
1/1

చేలమీదే తడిసి ముద్దవుతున్న పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement