రిటర్న్ గిఫ్ట్‌గా రాజ్యాంగం పుస్తకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: తన కుమార్తె వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. బుధవారం తన కుమార్తె ఆశృతరెడ్డి వివాహాన్ని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెళ్లికి హాజరైన వెయ్యి మందికి పైగా అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్‌లు తీసుకుని వకీల్‌సాబ్ ఆలోచనను అభినందించారు.
45 గొర్రెల అపహరణ
భువనగిరి: భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో 45 గొర్రెలను మంగళశారం రార్రి దుండగులు అపహరించారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తి గ్రామానికి చెందిన మేడబోయిన బాలయ్య మంగళవారం సా యంత్రం గ్రామ సమీపంలోని తన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డులోకి గొర్రెలను తోలాడు. రాత్రి 7.30 గంటలకు పాలు పిండుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు గొర్రెల షెడ్డు వద్దకు రాగా.. 45 గొర్రెలు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా గొర్రెలు కనిపించకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెలను అపహరించుకెళ్తున్నట్లు అందులో రికార్డయ్యింది. దీంతో బాధితుడు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
మహిళపై దాడి కేసులో
ఆరుగురికి జైలుశిక్ష
రామన్నపేట: మహిళపై దాడిచేసి గాయపరిచిన కేసులో ఆరుగురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎస్. శిరీష బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై 2019వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో అదే గ్రామానికి చెందిన కవాటి మహేష్, కవాటి నరేష్, కవాటి శివ, ఏనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుదర్శన్ దాడి చేసి గాయపరిచారు. దీంతో సదరు మహిళ ఆరుగురిపై వలిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ పి. శివనాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి ఆరుగురిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.


