క్రమశిక్షణతో చదవాలి
భువనగిరి : విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. భువనగిరి పట్టణ శివారులోని కేజీబీవీని మంగళవారం రాత్రి ఆయన సందర్శించారు. కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత గురించి విద్యార్థినులకు వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆలేరు సీహెచ్‌సీకి
డెంటల్ సర్జన్
ఆలేరు: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కి ఎట్టకేలకు డెంటల్ సర్జన్ నియమించారు. ఈ సీహెచ్‌సీలో వైద్యుల కొరతపై ఈ నెల 6న సాక్షి దినపత్రికలో ‘వందల్లో రోగులు.. ఏడుగురే వైద్యులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ హనుమంతరావు చొరవతో డీసీహెచ్ ఇటీవల కాంట్రాక్ట్ పద్ధతిలో సీహెచ్‌సీకి డెంటల్ సర్జన్‌గా భువనగిరికి చెందిన డాక్టర్ బి.గాంధీని నియమించారు. ఆయన వారం రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే దాదాపు ఏడాదిన్నరగా డెంటల్ సర్జన్ లేకపోవడంతో ఆలేరు సీహెచ్‌సీకి వచ్చే రోగులు భువనగిరి, జనగాం ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా ఆలేరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ వ్యయప్రయాసలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చొరవతో డెంటల్ సర్జన్ నియామకంతో దంత రోగుల కష్టాలు తీరుతున్నాయి. అయితే ఆలేరు సీహెచ్‌సీలో త్వరలో రూట్ కెనాల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని డెంటర్ సర్జన్ డాక్టర్ గాంధీ తె లిపారు.
మెనూ ప్రకారం
భోజనం అందించాలి
చౌటుప్పల్ రూరల్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలతోపాటు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె మంగళవారం సందర్శించి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో పూర్తిచేసేలా అధికారులు దృష్టిసారించాలన్నారు. ఆమె వెంట చౌటుప్పల్ ఎంపీడీఓ సందీప్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ ఉన్నారు.
ఎమ్మెల్యే ఐలయ్యపై చర్యలు
తీసుకోవాలని ఫిర్యాదు
యాదగిరిగుట్ట: అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై వస్తున్న అక్రమ ఆస్తుల ఆరోపణలపై ప్రజల నుంచి దృష్టిని మళ్లించేందుకే ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్‌రావుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, నరహరి, తోటకూరి బీరయ్య, పేరబోయిన సత్యనారాయణ, కొన్యా ల నరసింహారెడ్డి, దేవపూజ అశోక్, కవిడే మహేందర్, ఆరె శ్రీధర్‌గౌడ్, పబ్బాల సాయి, అంకం నర్సింహ, యాకూబ్ పాల్గొన్నారు.
క్రమశిక్షణతో చదవాలి
క్రమశిక్షణతో చదవాలి


