విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
రామన్నపేట : విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించబోమని కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఫార్మసీ సేవలతోపాటు రికార్డులు, ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ఆయుర్వేదిక్ వైద్యాలయాన్ని సందర్శించారు. విధులకు గైర్హాజరైన వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేందాన్ని సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల విన్నపం మేరకు షెడ్‌లపై నుంచి ప్లాట్‌పామ్‌పై నీరు పడకుండా డోర్లు బిగించాలని, గుంతల్లో మట్టినింపాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. పొడవైన స్తంభాలను అమర్చి విద్యుత్‌తీగల ఎత్తు పెంచాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. తేమ ఎక్కువగా చూపిస్తున్న మాయిశ్చర్ మిషన్‌ను సీజ్ చేశారు. రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓలు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఆయనవెంట డీసీహెచ్‌ఎస్ చిన్నానాయక్, తహసీల్దార్ సి.లాల్‌బహదూర్‌శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సీసీ నర్సింహ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ హనుమంతరావు హెచ్చరిక
రామన్నపేట ఏరియా ఆసుపత్రి తనిఖీ
విధులకు గైర్హాజరైన వైద్యుల
సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు


